Begin typing your search above and press return to search.

పెద్ద కంపెనీల‌కు మ‌రీ ఇంత పాడు బుద్ధా..?

By:  Tupaki Desk   |   18 May 2016 2:40 PM GMT
పెద్ద కంపెనీల‌కు మ‌రీ ఇంత పాడు బుద్ధా..?
X
పేరు గొప్ప ఊరు దిబ్బ అని మ‌నోళ్ల ఎప్పుడో చెప్పేశారు. దానికి త‌గ్గ‌ట్లే ఉంది పెద్ద‌.. పెద్ద కంపెనీల య‌వ్వారాలు చూస్తుంటే. తాజాగా రెండు పెద్ద మోటారు కంపెనీల దొంగ‌బుద్ధి బ‌య‌టకు వెల్ల‌డి కావ‌టం ప్ర‌పంచానికి షాకింగ్ గా మారింది. ఆ మ‌ధ్య‌న అనుమ‌తుల కోసం.. గొప్ప‌ల కోసం ఫోక్స్ వ్యాగ‌న్ కంపెనీ త‌న కార్ల‌లో కాలుష్యం త‌క్కువ వెద‌జ‌ల్లుతుంద‌న్న భావ‌న క‌లిగించేలా ఒక సాఫ్ట్ వేర్ సాయంతో మోసం చేసిన వైనం బ‌య‌ట‌కు పొక్క‌టం తెలిసిందే. అప్ప‌ట్లో ఆ ఉదంతం సంచ‌ల‌నంగా మారింది.

ఇదిలా ఉంటే.. తాజాగా రెండు పెద్ద పెద్ద మోటారు కంపెనీలు త‌మ త‌ప్పుల్ని ఒప్పుకుంటూ చెంప‌లేసుకోవ‌టం ప్ర‌పంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఘ‌న‌త వ‌హించిన పెద్ద కంపెనీలు.. త‌మ ఉత్ప‌త్తుల గురించి.. నాణ్య‌త గురించి చెప్పే నీతుల‌న్నీ శ్రీరంగ నీతులే త‌ప్పించి.. అందులో నిజాలు లేవ‌న్న విష‌యం తేలిపోయింది. ఇంధ‌న ప‌రీక్ష‌ల్లో తాము చేసిన అక్ర‌మాల గురించి ప్ర‌ఖ్యాత మోటారు కంపెనీ మిత్సుబిషి లెంప‌లేసుకున్న గంట‌ల వ్య‌వ‌ధిలోనే మ‌రో జ‌పాన్ దిగ్గ‌జ కంపెనీ సుజుకీ సైతం తాను అలాంటి త‌ప్పునే చేసిన‌ట్లుగా ఒప్పుకొని సంచ‌ల‌నం సృష్టించింది.

తాము చేసిన త‌ప్పుల గురించి రెండు కంపెనీలు స్వ‌యంగా ఒప్పుకోవ‌టంతో మార్కెట్లో ఈ రెండు కంపెనీల షేర్లు తీవ్ర ప్ర‌భావానికి లోన‌య్యాయి. మిత్సుబిషి కంపెనీ ఇండియాలో అంత పాపుల‌ర్ కాకున్నా.. సుజుకికి మాత్రం ఇండియాలో ఉన్న ప‌ర‌ప‌తి ఎంత‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సి అవ‌సరం లేదు. మారుతితో కలిసి ప‌ని చేసే సుజుకి మీద న‌మ్మ‌కం మొత్తం ఒక్క‌సారి వ‌మ్ము అయ్యేలా వారి తాజా మాట‌లు ఉన్నాయి.

జ‌పాన్ లోని నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా. ఇంధ‌న సామ‌ర్థ్య టెస్టింగ్ ప‌ద్ధుతులు ఉన్నాయ‌ని.. కర్బ‌న ఉద్గారాల‌ను వాడుతున్న‌ట్లుగా కంపెనీ ప్ర‌క‌టించింది. ఇలా దొంగ‌బుద్ధితో వ్య‌వ‌హ‌రించిన 16కు పైగా మోడ‌ళ్ల‌ను తాము జ‌పాన్ మార్కెట్లోకి విడుద‌ల చేసిన‌ట్లుగా కంపెనీ పేర్కొంది. న‌మ్మ‌కానికి ప్ర‌తిరూపం లాంటి సుజుకి లాంటి కంపెనీనే ఈ త‌ర‌హా క‌క్కుర్తి ప‌నుల‌కు పాల్ప‌డితే.. స‌రిగ్గా లెక్క తేలిస్తే ఈ త‌ర‌హా కంపెనీలు ఇంకెన్ని ఉన్నాయ‌న్న సందేహం క‌ల‌గ‌టం ఖాయమ‌ని చెప్పాలి. న‌మ్మ‌కం మీద కొట్టే ఇలాంటి కంపెనీల మీద చ‌ట్టాలు ఎంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాలి..?