Begin typing your search above and press return to search.

జపాన్ కు పంపే మారుతి కారు ఏదంటే..?

By:  Tupaki Desk   |   13 Dec 2015 8:29 AM GMT
జపాన్ కు పంపే మారుతి కారు ఏదంటే..?
X
‘మేడిన్ జపాన్’ అన్న మాటకు ప్రపంచంలో ఎంత గిరాకీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమొబైల్ మొదలుకొని ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా జపాన్ కు బెస్ట్ ప్రొడక్ట్ ఇచ్చే వారు ఉండరంటారు. మరి.. అలాంటి జపాన్ కు ఇండియాలో తయారు చేసిన కారును పంపటమంటే..? కచ్ఛితంగా ఆసక్తికరమే. ఎలక్ట్రానిక్.. ఆటోమొబైళ్లను జపాన్ నుంచి దిగుమతి చేసుకోవటమే తప్పించి.. ఎగుమతి అన్న మాటే ఉండదు. అలాంటిది జాపాన్ కు ఇండియాలో తయారు చేసిన ‘మేడిన్ ఇండియా’ కారు జపాన్ కు ఎగుమతి కానుంది.

ఇండియాలోని ప్రఖ్యాత మారుతి సుజుకీ సంస్థ తయారు చేసిన కారును జపాన్ కు ఎగుమతి చేయనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. తొలిసారి భారత్ నుంచి కార్లను జపాన్ దిగుమతి చేసుకుంటున్నట్లు ప్రకటించారు. మరి.. జపాన్ లాంటి దేశానికి ఎగుమతి చేయనున్న మారుతి కారు ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మారుతిలో ఇప్పటికే ఎన్నోవిజయవంతమైన కార్లు ఉన్నాయి. కానీ.. వీటన్నింటికి మించి.. ఈ మధ్యనే విడుదల చేసిన ‘‘బాలెనో’’ను ఎగుమతి చేయనున్నట్లు ప్రకటించారు.

ఏటా 20 వేల నుంచి 30వేల వరకు కార్లను ఎగుమతి చేయాలని భావిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ మధ్యనే విడుదలై విజయవంతమైన బాలెనో కు దేశీయంగానే విపరీతమైన గిరాకీ ఉంది. హైదరాబాద్ మార్కెట్ చూస్తే.. బాలెనోను బుక్ చేసుకున్న వారికి కనిష్ఠంగా 21 రోజుల నుంచి గరిష్ఠంగా 90 రోజుల మధ్య కాలంలో డెలివరీ కి సమయం తీసుకుంటున్నారు. ప్రీ బుకింగ్స్ తీసుకొని.. ఆర్డర్ ప్రకారం డెలివరీ చేస్తున్నారు. దేశీయంగా ఇంత డిమాండ్ ఉన్న బాలెనోను జపాన్ మార్కెట్ లోకి విడుదల చేయటం గమనార్హం. ఇండియాలో భారీగా డిమాండ్ ఉన్న బాలెనో.. జపనీయుల మనసుల్ని ఎంత వరకూ దోచుకుంటుందో చూడాలి.