Begin typing your search above and press return to search.

చైనాకు షాక్‌.. ఇండియాకే జ‌పాన్ స‌పోర్ట్

By:  Tupaki Desk   |   18 Aug 2017 9:26 AM GMT
చైనాకు షాక్‌.. ఇండియాకే జ‌పాన్ స‌పోర్ట్
X
రెచ్చ‌గొట్టే దోర‌ణితో ముందుకు సాగుతున్న పొరుగు దేశం చైనాకు దిమ్మ‌తిరిగే షాక్ ఇది. చైనాతో ఏర్ప‌డిన‌ డోక్లామ్ వివాదంలో జ‌పాన్ కూడా ఇండియాకే మ‌ద్ద‌తిచ్చింది. బ‌ల‌ప్రయోగంతో ఏక‌ప‌క్షంగా య‌థాత‌థ స్థితిని మార్చ‌డం స‌రికాద‌ని జ‌పాన్ అభిప్రాయ‌ప‌డింది. ఇప్ప‌టికే అమెరికా కూడా ఈ విష‌యంలో భార‌త్‌ కు మ‌ద్ద‌తిచ్చిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు జ‌పాన్ కూడా భార‌త్ వైపు నిల‌వ‌డంతో చైనా మ‌రిన్ని చిక్కుల్లో ప‌డింది. వ‌చ్చే నెల‌లో జపాన్ ప్ర‌ధాని షింజో అబె భార‌త్ ప‌ర్య‌ట‌న‌కు రానున్న నేప‌థ్యంలో ఆ దేశం భార‌త్‌ కు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం గ‌మ‌నార్హం.

``డోక్లామ్ ప్రాంతం చైనా - భూటాన్ మ‌ధ్య వివాదాస్ప‌దంగా ఉంద‌ని మాకు తెలుసు. ఆ రెండు దేశాలు కూడా వివాదం ఉంద‌ని అంగీక‌రించాయి`` అని జ‌పాన్ అంబాసిడ‌ర్ కెంజీ హిర‌మ‌త్సు అన్నారు. ``ఇలాంటి వివాదాస్ప‌ద ప్రాంతంలో ఒక దేశం ఏక‌ప‌క్షంగా బ‌ల‌ప్ర‌యోగంతో య‌థాత‌థ స్థితిని మార్చాల‌ని చూడ‌టం స‌రికాదు. చ‌ర్చ‌ల ద్వారా శాంతియుత మార్గంలో స‌మ‌స్య ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నించాలి అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మొత్తం ఆసియా ప్రాంతాన్ని ప్ర‌భావితం చేసే ఈ అంశాన్ని జపాన్ నిశితంగా ప‌రిశీలిస్తోంది`` అని హిర‌మ‌త్సు తెలిపారు. ఇక ఈ అంశంలో ఇండియా పాత్ర‌పై కూడా ఆయ‌న స్పందించారు. ``భూటాన్‌ తో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాల కార‌ణంగా భార‌త్ ఈ విష‌యంలో జోక్యం చేసుకున్న‌ద‌ని మాకు అర్థ‌మైంది. దౌత్య మార్గాల ద్వారా ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూస్తామ‌ని విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్ చెబుతూనే ఉన్నారు. ఇదే స‌రైన వైఖ‌రి అని మేం కూడా భావిస్తున్నాం`` అని హిర‌మ‌త్సు చెప్పారు.

డోక్లామ్‌ లో రెండు నెల‌లుగా ఇండియా - చైనా మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. భారత్-చైనా-భూటాన్...- ఈ మూడు దేశాల మధ్యన డోక్లామ్ ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం తమదేనని భూటాన్ వాదన. దీనికి సంబంధించి చైనా-భూటాన్‌ ల మధ్య చాలాకాలంగా వివాదం ఉంది. భూటాన్ నిరసనను పట్టించుకోకుండా, చైనా ఏకపక్షంగా డోక్లామ్‌ లోకి రోడ్డు మార్గాన్ని నిర్మించటానికి జూన్‌ లో ప్రయత్నాలు ప్రారంభించింది. భూటాన్‌కు మద్దతుగా భారత్.. చైనా ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించింది. డోక్లామ్‌ లో చైనా రోడ్డును నిర్మించటం భూటాన్‌ కేగాక తమ దేశ ప్రయోజనాలకు కూడా భంగకరమని భారత్ పేర్కొంది. కానీ, చైనా వినకపోవటంతో సైనికులను తరలించి అక్కడ మోహరించింది. దీనికి పోటీగా చైనా కూడా సైనికదళాల మోహరింపును పెంచింది. ప్రతిష్టంభన పెరిగిన దశలో.. ఇరుపక్షాల సైనికులను ఉపసంహరించుకొని చర్చలు జరుపుదామని భారత్ ప్రతిపాదించింది. చైనా మాత్రం.. తమ సైన్యాన్ని విరమించేది లేదని, భారతే వెనుకకు తగ్గాలని ఏకపక్షంగా మాట్లాడుతూ - యుద్ధవాతావరణాన్ని సృష్టిస్తోంది.