Begin typing your search above and press return to search.

అమెరికాపై దాడి జరిగితే టీవీ చూసేదెవరు?

By:  Tupaki Desk   |   6 Aug 2016 7:23 AM GMT
అమెరికాపై దాడి జరిగితే టీవీ చూసేదెవరు?
X
తాజాగా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై ఒక ట్వీట్ హల్ చల్ చేస్తుంది. "డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడు అయితే.. ఒక్క అమెరికా సమస్యలే కాదు - ప్రపంచం మొత్తం సమస్యలు తీర్చేస్తాడు" అని. ఆ ట్వీట్ లో ఉన్నది వెటకారమా లేక అక్షర దోషమా అనే అనుమానాలు తాజాగా కలుగుతున్నాయి. ఈ ట్వీట్ లో "సమస్య" స్థానంలో "సరదా" అని పెట్టుకుని ఆ వాక్యం చదివితే.. సరిగ్గా సరిపోతుందేమో అనిపించకమానదు. దీనికి కారణం మరేదో కాదు.. ఏమాత్రం అడ్డుఅదుపు లేని ఆయన నోరు!! ప్రత్యర్థి అయిన మహిళను దెయ్యం అన్నా - ఆమెకు ప్రపంచ ఉగ్రవాదులతో సంబందాలు ఉన్నాయని ఆరోపించినా ఆయనకే చెల్లింది. ఆరోపణలు చేయడానికి నోరు ఉంటే చాలు.. వాటికి సంబందించిన సాక్ష్యాలు, చేసే వ్యక్తికి విజ్ఞత అవసరం లేదని బాగా నమ్మే ట్రంప్ ఇప్పుడు ప్రపంచ దేశాలపై సంచలన వ్యాఖ్యలు - ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు.

ఇప్పటికే చైనాతో సహా పలు దేశాలపై విమర్శలు చేసిన రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తాజాగా జపాన్ పై విరుచుకుపడ్డారు. నాటోకు ఎటువంటి సొమ్ము చెల్లింపులు లేకపోయినా కూడా అమెరికా రక్షణను జపాన్ - దక్షిణ కొరియాలు అడ్డూ అదుపూలేకుండా పొందుతున్నాయని, జపాన్ పై అమెరికాకు ప్రేమ ఉంది తప్ప.. అమెరికా పై జపాన్ కు అలాంటివి ఏమీ లేవని తేల్చి చెప్పేశారు. ఈ సందర్భంగా... ఒకవేళ జపాన్ పై దాడి జరిగితే అమెరికా మొత్తం సైన్యాన్ని ఉపయోగించి ఆ దేశానికి అండగా నిలుస్తుంది కానీ.. అదే ఎవరైనా అమెరికాపై దాడిచేస్తే మాత్రం.. జపనీయులంతా ఇంట్లో కూర్చుని సోనీ టీవీ చూస్తూ గడుపుతారని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో జపాన్ తో పాటు జర్మనీ - దక్షిణ కొరియా - సౌదీ అరేబియా దేశాలను కూడా ట్రంప్ వదలలేదు. జపాన్ తో పాటు దక్షిణ కొరియా - జర్మనీ - సౌదీ అరేబియా మొదలైన దేశాలను అమెరికా కాపాడుతోందని దీనికోసం ఆ దేశాలు ఎటువంటి పైకమూ చెల్లించడం లేదని చెప్పుకొచ్చారు. ఇలాటి ఈ పరిస్థితి మారాలని చెబుతున్న ట్రంప్.. ఉత్తర కొరియా నుంచి జపాన్ - దక్షిణ కొరియాలకు ముప్పు పొంచి ఉందని చెప్పారు. అందుకు జపాన్ - దక్షిణ కొరియా సిద్ధంగా ఉండాలని కూడా ఒక ఉచిత సలహా ఇచ్చారు! ఈ స్థాయిలో ట్రంప్ చెలరేగిపోతున్నారు. ఐయొవాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న సందర్భంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.