Begin typing your search above and press return to search.

ఫిడేల్ చక్రవర్తిలా 'ఇవాంక' తీరు.. తీవ్ర దుమారం

By:  Tupaki Desk   |   18 April 2020 5:00 PM GMT
ఫిడేల్ చక్రవర్తిలా ఇవాంక తీరు.. తీవ్ర దుమారం
X
రోమ్ తగలబడుతుంటే.. రోమన్ చక్రవర్తి ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారట.. ఇప్పుడు కరోనాతో అమెరికా తగలబడుతుంటే అధ్యక్షుడు ట్రంప్ నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరించడం.. ఆయన కూతురు, ప్రధాన సలహాదారు ఇవాంక ఏకంగా టూర్ కు వెళ్లడం దుమారం రేపుతోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ప్రధాన సలహాదారు అయిన అందగత్తె ‘ఇవాంక ట్రంప్’ తీరుపై ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాను కరోనా కమ్మేసి సెకన్లకు, గంటలకు పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్ నిర్లక్ష్యానికి పెద్ద ఎత్తున ప్రాణాలు పోతున్నాయి. ఇప్పుడు ఆయన కూతురు ఇవాంక తీరు తీవ్ర వివాదాస్పదమైంది.

ఇవాంక అమెరికా ప్రభుత్వంలో సలహాదారుగా.. ప్రభుత్వాన్ని నడిపించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలు అందరూ పాటించాలని వీడియో సందేశం ఇచ్చిన ఇవాంక ఇప్పుడు దాన్ని తుంగలో తొక్కి విహారయాత్రలకు వెళ్లడంపై నెటిజన్లు, అమెరికన్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మహమ్మారి ప్రబలుతున్న ఈ సమయంలో ఇలా చేయడం ఏంటని ఇవాంకపై విరుచుకుపడుతున్నారు.

తాజాగా యూదుల పండుగ పాసోవర్ ను సెలెబ్రేట్ చేసుకోవడానికి ఇవాంక తన భర్త జారేద్ కుష్ణర్ తో కలిసి వాషింగ్టన్ లోని తన నివాసం నుంచి న్యూజెర్సీకి వెళ్లారు. అయితే న్యూజెర్సీలో కరోనా తీవ్రంగా ఉంది. వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇంట్లో ఉండకుండా ఇవాంక ఇలా టూర్ కు వెళ్లడం.. పండుగలు చేసుకోవడంపై అమెరికన్లు ఫైర్ అవుతున్నారు. తండ్రి ట్రంప్, కూతురు ఇవాంకలు కరోనాపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ట్రంప్, ఇవాంక తీరు చూశాక మరికొన్ని నెలల్లో అమెరికా లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు ఓట్లు పడడం కష్టమేనన్న భావన వ్యక్తమవుతోంది. కరోనా చర్యలు ఇప్పటికీ చేపట్టకుండా తగ్గిందంటూ ట్రంప్ మాట్లాడుతుండడంపై అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.