Begin typing your search above and press return to search.

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌.. భార‌త్ పేస్ గుర్రం భావోద్వేగం!

By:  Tupaki Desk   |   4 Oct 2022 8:34 AM GMT
టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌.. భార‌త్ పేస్ గుర్రం భావోద్వేగం!
X
భార‌త్ పేస్ గుర్రం.. జ‌స్పీత్ బుమ్రా ఒంటి చేత్తో ఎన్నోసార్లు భార‌త్‌కు త‌న బౌలింగ్‌తో మ‌ర‌పురాని విజ‌యాల‌ను అందించాడు. ఆరంభ ఓవ‌ర్ల‌తోపాటు స్లాగ్ ఓవ‌ర్ల‌లో త‌క్కువ ప‌రుగులు ఇస్తూ వికెట్ల‌ను ప‌డ‌గొట్ట‌డంతో బుమ్రాకు సాటివ‌చ్చేవారు ఎవ‌రూ లేరంటే అతిశ‌యోక్తి కాదు.

ఈ అక్టోబ‌ర్‌లోనే జ‌ర‌గ‌నున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్ ఆశ‌ల‌న్నీ ఈ పేస్ గుర్రంపైనే పెట్టుకుంది. అయితే అనూహ్యంగా గాయంతో జ‌స్పీత్ బుమ్రా మొత్తం వ‌ర‌ల్డ్ క‌ప్ కే అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో భార‌త్ అభిమానులు డీలా ప‌డ్డారు.

ఈ నేప‌థ్యంలో గాయంతో టీ20 ప్ర‌పంచ్ క‌ప్ కు దూరం కావ‌డంపై తాజాగా జ‌స్పీత్ బుమ్రా సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించాడు. వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌లేక‌పోతుండ‌టంపై భావోద్వేగానికి గుర‌య్యాడు. తాను కోలుకోవాల‌ని ఆశించిన ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌తలు, ధ‌న్య‌వాదాలు తెలిపాడు. ఈ మేర‌కు బుమ్రా ట్వీట్ చేశాడు. తాను కోలుకోగానే ఆస్ట్రేలియాలో మ‌న భార‌త్ టీమ్‌ను ఉత్సాహ‌ప‌రుస్తాన‌ని పేర్కొన్నాడు. త‌న గాయం ప‌ట్ల సానుభూతి, ప్రేమ చూపుతూ తాను త్వ‌ర‌గా ఆరోగ్యంగా ఉండాల‌ని ఆశించిన ప్ర‌తి ఒక్క‌రికీ ట్విట్ట‌ర్‌లో కృత‌జ్ఞ‌త‌లు చెప్పాడు.

గాయం నుంచి కోలుకోగానే ఆస్ట్రేలియా వెళ్లి భార‌త్ టీమ్‌కు మద్ద‌తు తెలుపుతాన‌ని బుమ్రా వెల్ల‌డించాడు. కాగా వెన్ను గాయంతో ప్ర‌స్తుతం సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న‌ టీ20 సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు.. బుమ్రా. వ‌ర‌ల్డ్ క‌ప్ నాటికి కూడా ఈ గాయం తగ్గే అవ‌కాశం లేక‌పోవ‌డంతో ఈ మెగా టోర్నీకి బుమ్రా పూర్తిగా దూర‌మ‌వుతున్నాడ‌ని భార‌త్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇప్ప‌టికే అధికారికంగా ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.

వెన్నులో ఫ్రాక్చర్ కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా... ప్రస్తుతం నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ (ఎన్‌సీఏ)లో చికిత్స పొందుతున్నాడు. 'బుమ్రా గాయం తగ్గడానికి చాలా సమయం పట్టేలా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను ప్రపంచకప్‌లో ఆడలేడు. వైద్య నివేదిక‌లు, నిపుణుల సలహాలు, సూచనల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం' అని బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపాడు.

మ‌రోవైపు అసాధారణమైన బౌలింగ్ యాక్షన్ కారణంగానే బుమ్రా వెన్ను ఒత్తిడికి గురవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సుమారు 6 నెలల వరకు బుమ్రా ఆట‌కు దూర‌మ‌య్యే ప‌రిస్థితులున్నాయ‌ని స‌మాచారం. బుమ్రా స్థానంలో స్టాండ్‌బైగా ఉన్న మహమ్మద్ షమీతోపాటు దీపక్ చాహర్‌, మహమ్మద్ సిరాజ్ రేసులో ఉన్నారు.

కాగా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఈసారి 16 జ‌ట్లు బ‌రిలోకి దిగుతున్నాయి. అక్టోబ‌ర్ 16న శ్రీలంక, న‌మీబియా మ్యాచుతో వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభ‌మ‌వుతుంది. న‌వంబ‌ర్ 13న ఫైన‌ల్ మ్యాచుతో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ముగుస్తుంది. ఈ క‌ప్ ఆస్ట్రేలియాలో జ‌రుగుతుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.