Begin typing your search above and press return to search.

ఢిల్లీ శివార్ల‌లో ఇంట‌ర్నెట్ బంద్‌

By:  Tupaki Desk   |   19 March 2017 8:14 AM GMT
ఢిల్లీ శివార్ల‌లో ఇంట‌ర్నెట్ బంద్‌
X
ఢిల్లీని ఆనుకొని... ఇంకా చెప్పాలంటే దేశ రాజ‌ధాని విస్త‌ర‌ణ‌తో క‌లిసిపోయిన రాష్ట్రమైన హ‌ర్యానాలో ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను నిలిపివేస్తున్నారు. తమ వర్గానికి రిజర్వేషన్లు కోరుతూ సోమవారం పార్లమెంట్‌ మార్చ్‌ నిర్వహించాలని అఖిల భారత జాట్‌ అర్కాషన్‌ సంఘర్ష్‌ సమితి (ఎఐజే ఏఎస్‌ఎస్‌) ప్రణాళికలు రచించింది. రిజర్వేషన్ల విషయంలో కేంద్రం జోక్యం చేసుకో వాలని సమతి అధ్యక్షులు యాస్పాల్‌ మాలిక్‌ డిమాండ్‌ చేస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలోనే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని, అయితే తమ డిమాండ్లు ఇప్పటికీ అమలు కాలేదని మాలిక్‌ ఆరోపించారు. ఈ నెల 20న పార్లమెంట్‌ మార్చ్‌ నిర్వహించాలని జాట్‌ కార్యవర్గం నిర్ణయించడంతో హర్యానాలో ఇంటర్నెట్‌ సేవలను ప్రభుత్వం రద్దు చేసింది.

హ‌ర్యానాలోని సమస్యాత్మక జిల్లాల్లో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. అలాగే ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు ట్రాక్టర్లు - ట్రాలీలు ప్రయాణించడాన్ని కూడా నిలిపివేశారు. పరిస్థితిని అదుపు చేయడానికి సైన్యం సహాయం తీసుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తోందంటే ప‌రిస్థితి ఎంత ఉద్రిక్త‌త స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. పార్ల‌మెంటు స‌మావేశాల నేప‌థ్యంలోనే త‌మ రిజ‌ర్వేష‌న్ సంగ‌తి తేల్చుకోవాల‌ని జాట్లు తేల్చుకోవ‌డంతో ఇంట‌ర్నెట్ ను నిలిపివేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇదిలాఉండ‌గా....ప్రధాని నరేంద్ర మోడీ సోషల్‌ మీడియా వినియోగంతో ప్రభుత్వానికి ఎలాంటి వ్యయం లేదని ప్రధాని మంత్రి కార్యాలయం (పీఎంఓ) వెల్లడించింది. సమాచార హక్కు ద్వారా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ప్రశ్నకు పై విధంగా పీఎంఓ సమాధానం ఇచ్చింది. మైగవ‌ర్నమెంట్‌. ఇన్‌ నిర్వహించిన పోటీలో 'పీఎంఓ ఇండియా' అనే యాప్‌ ను విద్యార్థులు రూపొందించారని తెలిపింది. ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి సోషల్‌ మీడియా కోసం ఎంత వ్యయం చేశారని సిసోడియా తన దరఖాస్తులో ప్రశ్నించారు. జిమెయిల్‌ - యుట్యూబ్‌ - ట్విటర్‌ - ఫేస్‌ బుక్‌ లో పిఎంఓ ఎలాంటి ప్రచారమూ నిర్వహించడం లేదని కార్యాలయం స్పష్టం చేసింది. సోషల్‌ మీడియాలో జరుగుతున్న మేక్‌ ఇన్‌ ఇండియా, స్టార్ట్‌ అప్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా.. ప్రచారాలన్నీ విద్యార్థులు రూపొందించినవే అని కార్యాలయం తెలిపింది. ఆప్‌ ప్రభుత్వం సోషల్‌ మీడియాలో నిర్వహిస్తున్న 'టాక్‌ టూ ఎకె' ప్రచారంపై సిబిఐ కేసు నమోదు చేసిన 10 రోజుల తరువాత సిసోడియా ఈ దరఖాస్తు చేయడం విశేషం. సిసోడియాతో పాటు మరో పది మందిపై సిబిఐ కేసు దాఖలు చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/