Begin typing your search above and press return to search.

అసదుద్దీన్ ను చెడుగుడు ఆడుకున్నారు

By:  Tupaki Desk   |   16 March 2016 6:58 AM GMT
అసదుద్దీన్ ను చెడుగుడు ఆడుకున్నారు
X
అసదుద్దీన్ ఓవైసీకి పంచ్ ల మీద పంచ్ లు పడుతున్నాయి. తన తల మీద కత్తి పెట్టినా ‘‘భారత్ మాతా కీ జై’’ అనే మాట తన నోటి నుంచి రాదంటూ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. ఈ పరిస్థితి బయటే కాదు.. పార్లమెంటులోనే చోటు చేసుకుంది. అసద్ చేసిన వ్యాఖ్యలపై పలువురు విమర్శలు చేసినా.. ఒక విమర్శ మాత్రం అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.

రాజ్యసభలో అసద్ వ్యాఖ్యల్ని ప్రస్తావించిన ప్రముఖ సినీ రచయిత జావేద్ అక్తర్ మాట్లాడుతూ.. ‘‘ఓ నాయకుడు ఉన్నాడు. ఆయనది హైదరాబాద్ లో గల్లీ స్థాయి. రాజ్యాంగం చెప్పలేదు కనుక భారత్ మాతాకీ జై అననంటున్నారు. మరి.. షేర్వానీ.. టోపీ ధరించాలని కూడా రాజ్యాంగం చెప్పలేదు కదా’’ అంటూ చురకలేశారు. అంతేకాదు.. భారత్ మాతాకీ జై అనటం నా హక్కు అంటూ పలుమార్లు ఆయన నినదించారు.

ఇదిలా ఉంటే.. అసద్ వ్యాఖ్యలపై శివసేన ఘాటుగా స్పందిస్తూ.. ‘‘ఒవైసీకి ఈ దేశం ఎంతో ఇచ్చింది. కానీ.. ఆయన భారత్ లో ఉండే అవకాశాన్ని కోల్పోయారు. తనంతట తానే పాకిస్థాన్ వెళ్లిపోవాలి. లేకపోతే మేమే ఆయన్ని పంపించే కార్యక్రమం చేపడతాం’’ అని శివసేన నేత రాందాస్ కదమ్ మండిపడ్డారు. ఇక.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అసద్ పై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. లోక్ సభలో ఏదో మాట్లాడబోయిన అసద్ పై మండిపడ్డ వెంకయ్య.. ‘‘మీరు భారత్ మాతాకీ జై అనటానికి సిగ్గుపడుతున్నారు. ఇక కూర్చోండి. మీరు తల్లికీ సలాం చేయరు. భారతమాతకు సలాం చేయరు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

మరో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అసద్ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ..‘‘ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. మనం ఎంతటి క్లిష్ట సమయంలో ఉన్నామో సూచిస్తోంది. ఒక పౌరురాలిగా నాకు అనిపిస్తుందేమిటంటే.. మన దేశంలో మనమే భారతమాతను గౌరవించకపోతే.. మరి ఎక్కడ భారతమాతకు గౌరవం లభిస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. ఇన్ని తిట్లు తిన్న అసద్ .. తన తప్పును దిద్దుకునే ప్రయత్నం చేస్తారా?