Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఫాంహౌస్ కాదు..జ్యోతిష్యాల‌యం

By:  Tupaki Desk   |   30 July 2017 9:34 AM GMT
కేసీఆర్ ఫాంహౌస్ కాదు..జ్యోతిష్యాల‌యం
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డిపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ మండిప‌డ్డారు. విజయవాడ స్టేట్ గెస్ట్‌హౌస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సందర్భంగా మంత్రి జవహర్ నిప్పులు చెరిగారు.తెలంగాణ సీఎంకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, తెలంగాణలో పాలన చేతకాక పక్కరాష్ట్రం గురించి మాట్లాడుతున్నారని మంత్రి జవహర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ఫాంహౌస్‌ పేరు కేసీఆర్‌ జ్యోతిషాలయం అని పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. వైఎస్ జ‌గ‌న్‌ కు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉంద‌ని కేసీఆర్ ది బూటకపు సర్వే అని ఆయ‌న మండిప‌డ్డారు. 2014లో వైసీపీ విజయం సాధిస్తుందని కేసీఆర్‌ చెప్పారని అయితే ఫ‌లితం రివ‌ర్స్ అయింద‌ని అన్నారు. ఇప్పుడు జగన్ గెలుస్తారు అని భ్రమపడుతున్నారని వ్యాఖ్యానించారు.

జగన్ సీ ఎం అవుతాడని భ్రమపడుతూ పార్టీ నాయకులను సైతం నమ్మలేని స్థితిలో ఉన్నారని జ‌వ‌హ‌ర్ ఎద్దేవా చేశారు. ఉద్యోగుల్లో గందరగోళం సృష్టించడానికి వైసీపీ గందరగోళ వాతావరణం సృష్టిస్తుందని పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన వైసీపీ ప్లీనరీ ప్రశాంత్ కిశోర ప్రోమోలా ఉందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమం గురించి చర్చించకుండా ప్రశాంత్ కిశోర్ ప్రోమోలా జరిగిందని పేర్కొన్నారు. జగన్‌ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి జవహర్‌ అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం వ్యతిరేకమని వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని, పదవి విరమణ వయోపరిమితి తగ్గించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. జగన్‌, ముద్రగడలు మందకృష్ణను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

మ‌హిళలకు ఎటువంటి ఇబ్బందులు రానీయకుండా రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులను తొలగిస్తున్నట్లు మంత్రి జ‌వ‌హ‌ర్‌ వెల్లడించారు. బెల్ట్‌షాపులు ఎక్కడున్నా స్థానిక సీఐని బాధ్యున్ని చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మద్యం షాపుల నిర్వహణపై ఏమైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ ,ఆదాయ ఆంధ్రప్రదేశ్ కావాలంటే సీఎం చంద్రబాబు ద్వారా సాధ్యమవుతుందన్నారు.