Begin typing your search above and press return to search.

గంగూలీ పదవి మీద కన్నేసిన అమిత్ షా కొడుకు?

By:  Tupaki Desk   |   16 Sep 2022 4:21 AM GMT
గంగూలీ పదవి మీద కన్నేసిన అమిత్ షా కొడుకు?
X
నీతులు చెప్పే విషయంలో ప్రధాని నరేంద్ర మోడీకి సాటి వచ్చే వారే కనిపించరు. నోరు తెరిచినంతనే పెద్ద మనిషిలా.. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా.. విలువలు వల్లె వేయటం కోసమే పుట్టినట్లుగా వ్యవహరించే ఆయన మాటలకు చేతలకు మధ్య తేడాను దేశ ప్రజలంతా చూస్తున్నదే. ఎనిమిదేళ్లుగా ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్న ఆయన.. తాను చెప్పే విలువలకు తాను.. తన ప్రభుత్వం ఆచరించే విధానాలకు మధ్య తేడాను ఆయన ఇప్పటికే పలుమార్లు చేతల్లో చూపించేశారు.

తాజాగా దేశంలోనే అత్యంత పవర్ ఫుల్ పదవిగా భావించే బీసీసీఐ అధ్యక్షుడిగా తనకు అత్యంత సన్నిహితుడైన అమిత్ షా కుమారుడికి కట్టబెట్టేందుకు వీలుగా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. కుటుంబ పాలన.. వారసత్వం గురించి నిత్యం నీతులు చెప్పే మోడీ అండ్ కో.. అమిత్ షా కొడుక్కి బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) అధ్యక్ష పదవి ఎందుకు? అన్న అంశంపై సూటిగా సమాధానం చెప్పరెందుకు? అన్నది ప్రశ్న.

ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆయన.. ఆ పదవిలో మరింత కాలం కొనసాగేందుకు వీలుగా బీసీసీఐ రాజ్యాంగాన్ని మార్చుకునే ప్రయత్నం చేయటం తెలిసిందే. దీనికి సుప్రీం కోర్టు అనుమతిని సైతం తాజాగా సాధించిన వైనం చూస్తే..రానున్న రోజుల్లో బీసీసీఐ పదవిని అంటిపెట్టి ఉండేందుకు అవసరమైన అన్ని కసరత్తుల్ని పూర్తి చేస్తున్నారా? అన్న సందేహం కలుగక మానదు.

ఎందుుకంటే.. బీసీసీఐ రాజ్యాంగంలో సవరణలకు ఆమోదం తెలుపుతూ సెప్టెంబరు 14న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రస్తుత పాలకమండలికి మరో విడత పదవులు చేపట్టేందుకు పచ్చజెండా ఊపినట్లైంది. సుప్రీం తాజా తీర్పుతో ఆఫీస్ బేరర్లు వరుసగా 12 ఏళ్ల పాటు పదవుల్లో కొనసాగే వెసులు బాటు కలిగిస్తుంది. స్టేట్ అసోసియేషన్లో ఆరేళ్లు.. బీసీసీఐలో ఆరేళ్లు కొనసాగే వీలు ఉంటుంది. దీంతో బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్ గంగూలీ.. కార్యదర్శిగా జై షా (అమిత్ షా కొడుకు) మరో మూడేళ్లు ఇప్పుడున్న పదవుల్లో కొనసాగే వీలు ఉంటుంది. నిజానికి వీరి పదవీ కాలం వచ్చే నెలతో ముగియనుంది.

అయితే.. ఇక్కడే మరో ట్విస్టు ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సౌరభ్ గంగూలీని ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్)కు అధ్యక్షుడిగా చేసి.. అమిత్ షా కొడుకును గంగూలీ కుర్చీలో కూర్చోబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు.ఇందులో భాగంగా అమిత్ షా కొడుక్కి బీసీసీఐ చీఫ్ పదవిని కట్టబెట్టేందుకు వీలుగా 15 రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లు సిద్ధంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

అదే జరిగితే ప్రధాని మోడీ మాష్టారు చెప్పే నీతులకు.. అమిత్ షా కొడుక్కి బీసీసీఐ చీఫ్ పదవి కట్టబెట్టే చేతలకు ఏ మాత్రం పొంతన ఉండదన్న విషయాన్ని మర్చిపోకూడదు. మరేం జరుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.