Begin typing your search above and press return to search.

ప్రత్యర్థి మీదే జయప్రద.. సరికొత్తగా నామినేషన్

By:  Tupaki Desk   |   3 April 2019 9:35 AM GMT
ప్రత్యర్థి మీదే జయప్రద.. సరికొత్తగా నామినేషన్
X
సీనియర్ నటి, మాజీ ఎంపీ అయిన జయప్రద ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ ను బుధవారం దాఖలు చేసింది. ఈ సందర్భంగా తన నామినేషన్ ను వినూత్నంగా ప్రకటించింది. ఇందుకోసం సోషల్ మీడియాను వేదికగా ఎంచుకుంది.

సమాజ్ వాదీ పార్టీ కి గుడ్ బై చెప్పాక అమర్ సింగ్ పార్టీలో కొన్నాళ్లు ఉన్న జయప్రద ఇప్పుడు ఉన్నట్టుండి బీజేపీలో చేరారు. అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఆమెకు ఆమె ప్రత్యర్థి పోటీచేస్తున్న సీటును కేటాయించి సంచలనం రేపింది. జయప్రద ఇదివరకు పోటీచేసి గెలిచిన రాంపూర్ సీటునే కేటాయించడం విశేషం.

సమాజ్ వాదీ నేత అజంఖాన్.. జయప్రదపై ఎన్నో తీవ్రమైన ఆరోపణలు, వేధింపులకు పాల్పడి అప్పట్లో వార్తల్లో నిలిచారు. ఇప్పటికీ జయప్రదకు - అజంఖాన్ కు మధ్య తీవ్రమైన శతృత్వం ఉంది. ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ తరుఫున రాంపూర్ నుంచి అజంఖాన్ పోటీచేస్తున్నారు. ఆయనకు పోటీగా బీజేపీ జయప్రదను దించడంతో వీరిద్దరి ఫైట్ యూపీలోనే హాట్ టాపిక్ గా మారింది.

రాంపూర్ లో నామినేషన్ వేసినప్పటి నుంచి ప్రకటన వరకు సోషల్ మీడియాలో లైవ్ అప్ డేట్స్ ఇస్తూ ప్రచారంలో జయప్రద వినూత్న పోకడలకు పోయారు. పుట్టిన రోజునాడే తాను రాంపూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశానని.. తనకు మీ ఆశీర్వాదాలు, దీవెనలు కావాలని కోరారు.

జయప్రద దివంగత ఎన్టీఆర్ పిలుపు మేరకు 1994లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతరం చంద్రబాబు 1996లో పార్టీని హైజాక్ చేయడంతో పార్టీని వీడారు. అనంతరం సమాజ్ వాదీ పార్టీలో చేరి 2004-09 మధ్య రాంపూర్ ఎంపీగా గెలిచారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి 2010లో ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అమర్ సింగ్ స్థాపించిన రాష్ట్రీయ లోక్ మంచ్ పార్టీలో చేరి 2012లో పోటీచేసినా గెలువలేదు. ఇప్పుడు 2019లో బీజేపీ లో చేరి మరోసారి ఎంపీగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.