Begin typing your search above and press return to search.

జగన్, చంద్రబాబుకు జయప్రకాశ్ నారాయణ కొన్ని సూచనలు..: అవి ఇవే..

By:  Tupaki Desk   |   24 Oct 2021 6:35 AM GMT
జగన్, చంద్రబాబుకు జయప్రకాశ్ నారాయణ కొన్ని సూచనలు..: అవి ఇవే..
X
ఏపీలో రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అధికార వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం నుంచి దాడులు చేసుకునేవరకు దారి తీసింది. టీడీపీ నాయకుడు పట్టాభి, సీఎం జగన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. అయితే పోలీసులు పట్టాభిని అరెస్టు చేసి విడుదల చేశారు. అయితే రెండు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం సమసి పోలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య జరిగిన పోరు రాష్ట్రంలో రాజకీయ వేడిని పుట్టించాయి. ఈ నేపథ్యంలో మిగతా పార్టీల నాయకులు రెండు పార్టీల మధ్య నెలకొన్న వివాదంపై స్పందిస్తున్నారు. తాజాగా లోక్ సత్తా మాజీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ ఇరు పార్టీలకు కొన్ని సూచనలు చేశారు.

2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ 2019లో అధికారి కోల్పోయింది. కొత్తగా ఏర్పాటు చేసుకున్న వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకులను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ, టీడీపీ మధ్య నిత్యం పోరు కొనసాగుతూనే ఉంది. అయితే మధ్యలో జరిగిన ఎన్నికల్లో మాత్రం వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తోంది. అయితే టీడీపీ మాత్రం ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపుతూ విమర్శలు చేస్తోంది.

ఇటీవల గంజాయి విషయంలో టీడీపీ నాయకుడు పట్టాభి సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ నాయకులు ఆరోపించారు. దీంతో కొందరు వైసీపీ నాయకులు పట్టాభి ఇంటికెళ్లి దాడి చేశారని సైకిల్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. దాడులకు నిరసనగా టీడీపీ ఒకరోజు బంద్ కు కూడా పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నాయకులు ఈ పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. కొందరు ఇరు పార్టీలకు సూచలను చేస్తున్నారు. తాజాగ జయప్రకాశ్ నారాయణ చేసిన సూచనలు ఆసక్తిని రేపాయి.

‘రాష్ట్రంలో నెలకొన్న వివాదాలను సమసి పోయేయా చేయాలి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజల్లో రాజకీయాలపై నమ్మకం పోతుంది. ఇరు పార్టీలు శాంతి వాతావరణంలో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి. ఒకరరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ద్వారా ఇరు పార్టీలపై ప్రజలకు అసహనం కలిగే అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వైసీపీ సైతం సంయమనం పాటించాలి. ఇరు పార్టీల నేతలు కవ్వింపు చర్యలకు పోకుండా ఉండాలి. పెద్ద మనసుతో ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవాలని, లేకుండా సమస్య పెద్దదవుతుంది.’

‘ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది, ఈ ప్రభావం అందరిపైన పడే అవకాశం ఉంది. అధిక ఆదాయాన్ని ఇచ్చే నగరాన్ని ఇప్పటికే కోల్పోయాం. దీంతో మరింత శ్రమించాల్సిన అవసరం ఏర్పడింది. సంక్షోభం ఏర్పడిన సమయంలో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు సహకరించుకోవాలి. అప్పుడే రాష్ట్రాభివృద్ధికి న్యాయం చేసినవారవుతారు. రాష్ట్రానికి అనేక రకాలుగా పెట్టుబడులకు అవకాశం ఉందని, ఆ అవకాశాలను జారవిడుచుకోవద్దు. రాష్ట్రంలో వనరులు పుష్కలంగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో వినియోగించుకుంటే రాష్ట్రాభివృద్ధి త్వరగా జరిగే అవకాశం ఉంది. ఇక ఖనిజ సంపద రాష్ట్రంలో పుష్కలంగా ఉంది. వాటిని వినియోగానికి సరైన మార్గం వెతకాలి. భవిష్యత్తు కోసం ఎందరో ఇప్పటినే అనేక త్యాగాలు చేశారు. వారి త్యాగాలను వృథా కానివ్వద్దు. అందువల్ల ఇలా వ్యక్తిగతంగా దూషణలు చేసుకోవడం ద్వారా రాష్ట్రం పరువు పోతుంది. ’ అని జయప్రకాశ్ నారాయణ సూచించారు.