Begin typing your search above and press return to search.

వాళ్లిద్ద‌రూ సీమ ద్రోహుల‌ట‌

By:  Tupaki Desk   |   2 Sep 2016 4:18 AM GMT
వాళ్లిద్ద‌రూ సీమ ద్రోహుల‌ట‌
X
రాయ‌ల‌సీమ‌లో సెంటిమెంట్ మ‌ళ్లీ రేగుతోంది. ఇన్నాళ్లు రాయ‌ల‌సీమ ప‌రిర‌క్ష‌ణ స‌మితినేత బైరెడ్డి రాజ‌శేఖ‌ర రెడ్డి రూపంలో సాగిన ఈ ఎపిసోడ్ ఇపుడు కాంగ్రెస్ చేత‌బ‌ట్టింది. మాజీ కేంద్రమంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి - కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్ర‌తినిధి తులసిరెడ్డి పాద‌యాత్రకు స్వీకారం చుట్టిన‌ట్లు ప్ర‌క‌టించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు - ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాయలసీమ ద్రోహులని మండిప‌డ్డారు. త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోతే ప్ర‌జ‌ల్లో సీమ వ్య‌తిరేకులుగా ముద్ర ప‌డ‌టం ఖాయ‌మ‌ని వారు హెచ్చ‌రించారు.

ఈ ఇద్ద‌రు నేత‌లు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీమ జిల్లాలకు జరుగుతున్న అన్యాయంపై అధికారంలో ఉన్న చంద్ర‌బాబు - ప్ర‌తిప‌క్షంలో ఉన్న జ‌గ‌న్ ఏమీ మాట్లాడటం లేదని విమర్శించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేయాలని ప్రతిపక్ష నేత జగన్‌ అడగకపోవడం దారుణమ‌ని అన్నారు. రాయలసీమ - ప్రకాశం - నెల్లూరు జిల్లాల రైతుల ప్రయోజనార్థం త్వరలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి చంద్ర‌బాబు రాయలసీమ అభివృద్ధికి 15 హామీలను ప్రకటించారని, వాటలో ఏ ఒక్కటీ అమలుచేయలేని కోట్ల సూర్య‌ప్రకాశ్ రెడ్డి - తుల‌సిరెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి హామీలు గుప్పించి నెరవేర్చరని, ప్రతిపక్ష నేత వాటిని ప్రశ్నించరని - ఈ ఇద్దరు నాయకులు చరిత్రలో సీమ ద్రోహులుగా నిలిచిపోతారని దుయ్య‌బ‌ట్టారు. పట్టిసీమ నిర్మాణం పూర్తిచేసి రాయలసీమకు 45 టీఎంసీల నీరు ఇస్తామని పదేపదే చెబుతున్నారని.. అయితే ఆ నీటి నిల్వకు ప్రాజెక్టులు ఎక్కడున్నాయని ఇద్ద‌రు నేత‌లు ప్రశ్నించారు.

గుండ్రేవుల - సిద్ధేశ్వరం ప్రాజెక్టులు పూర్తిచేస్తే పట్టిసీమ నుంచే వచ్చే నీటిని నిల్వ చేసుకొనే అవకాశం ఉన్నా నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించారని కోట్ల ఆరోపించారు. శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటి మట్టం తగ్గకుండా చర్యలు తీసుకోవాలని, కాదని నీటిని తరలిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయ‌న‌ హెచ్చరించారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ, రైతుల ప్రయోజనార్థం త్వరలో కోట్ల నాయకత్వంలో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి శ్రీశైలం జలాశయం వరకు 140 కి.మీ పాదయాత్ర చేపట్టనున్నామని వారు ప్ర‌క‌టించారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలుపరిచేలా ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమం చేపడతామన్నారు.