Begin typing your search above and press return to search.

అమ్మ ఎస్టేట్ లో మ‌రో అనుమానాస్ప‌ద మృతి

By:  Tupaki Desk   |   4 July 2017 6:03 AM GMT
అమ్మ ఎస్టేట్ లో మ‌రో అనుమానాస్ప‌ద మృతి
X
అమ్మ‌గా సుప‌రిచితురాలు త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత అనారోగ్యం ఏ ముహుర్తంలో మొద‌లైందో కానీ.. త‌మిళ‌నాట సంచ‌ల‌నాల‌కు కొద‌వ లేకుండా పోతోంది. అమ్మ మ‌ర‌ణ‌మే పెద్ద సంచ‌ల‌నంగా మార‌టమే కాదు.. ప‌లు సందేహాల‌కు తావిచ్చేలా ఉంద‌న్న విష‌యం తెలిసిందే. అమ్మ మ‌ర‌ణంపై సొంత పార్టీ నేత‌లు వెలిబుచ్చిన సందేహాల పుణ్య‌మా అని.. అమ్మ మ‌ర‌ణం వెనుక ఏదో కుట్ర దాగి ఉంద‌న్న భావ‌న సగ‌టు జీవిలో నెల‌కొంది.

ఇదిలా ఉంటే.. అమ్మ‌కు చెందిన ఆస్తుల‌కు సంబంధించి చోటు చేసుకుంటున్న అనూహ్య ప‌రిణామాలు పెను క‌ల‌క‌లానికి దారి తీస్తున్నాయి. మొన్నా మ‌ధ్య అమ్మ‌కు చెందిన కొడ‌నాడు ఎస్టేట్‌ కు చెందిన సెక్యూరిటీ గార్డులు అనూహ్యంగా హ‌త్య‌కు గురి కావ‌టం.. అమ్మ ఆస్తుల్లో అగ్నిప్ర‌మాదాలు.. చోరీలు చోటు చేసుకోవ‌టం లాంటివి త‌ర‌చూ జ‌రుగుతున్నాయి. ఈ సిరీస్ లో భాగంగా తాజాగా కొడ‌నాడు ఎస్టేట్‌ కు చెందిన అకౌంటెంట్ దినేష్ కుమార్ సూసైడ్ చేసుకోవ‌టం తాజా సంచ‌ల‌నంగా మారింది.

కొత్త‌గిరిలోని ఆయ‌న నివాసంలో ఉరేసుకొని చ‌నిపోయారు. దీంతో.. కొడ‌నాడు ఎస్టేట్స్ కు సంబంధించి అనుమానాస్ప‌ద మృతుల సంఖ్య నాలుగుకు చేరుకున్న‌ట్లైంది. రెండు నెల‌ల క్రిత‌మే కొడ‌నాడు ఎస్టేట్స్ లో ఒక సెక్యురిటీ గార్డును హ‌త్య చేయ‌టం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా అమ్మ ఆస్తికి సంబంధించి కీల‌క ప‌త్రాల్ని చోరీ చేసిన వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది. తాజాగా కొడ‌నాడు ఎస్టేట్స్ లో ప‌ని చేస్తున్న ముగ్గురు అకౌంటెంట్ల‌లో ఒక‌రైన దినేష్ కుమార్ అనూహ్యంగా ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌టం ఇప్పుడు ప‌లు సందేహాల‌కు తావిచ్చేలా ఉంది. మృత‌దేహాన్ని స్వాధీనంలోకి తీసుకున్న పోలీసులు కొత్త‌గిరి ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. నేడు.. మృత‌దేహానికి పోస్టుమార్టం నిర్వ‌హించ‌నున్నారు.

దినేష్ ఆత్మ‌హ‌త్య‌పై పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌మాచారం ప్ర‌కారం.. ఎస్టేట్ లోని ఇత‌ర ఉద్యోగులు క‌లిసి రెండు రోజుల క్రిత‌మే త‌మ‌ను ఉద్యోగాల నుంచి తొల‌గిస్తారేమోన‌న్న ఆందోళ‌న చెందిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ భయాందోళ‌న‌ల‌తోనే ఆత్మ‌హ‌త్య చేసుకొని ఉండొచ్చ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రోవైపు.. దినేష్ మృతి వెనుక ఏదైనా కుటుంబ వివాదాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఏమైనా.. కొడ‌నాడు ఎస్టేట్స్ కు సంబంధించి వ‌రుస‌గా చోటు చేసుకుంటున్న అనుమానాస్ప‌ద మ‌ర‌ణాలు అంత‌కంత‌కూ పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగించే అంశంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/