Begin typing your search above and press return to search.

అమ్మ ఆస్తుల‌పై త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ కీల‌క నిర్ణ‌యం

By:  Tupaki Desk   |   22 May 2020 11:50 AM GMT
అమ్మ ఆస్తుల‌పై త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ కీల‌క నిర్ణ‌యం
X
త‌మిళ‌నాడు ప్ర‌జ‌లంద‌రికీ అమ్మ‌.. మాజీ ముఖ్య‌మంత్రి - అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణించినా ఆమె ఆస్తుల గోల మాత్రం ప‌రిష్కారం కావ‌డం లేదు. ఆమె మ‌ర‌ణంతో ఆమెకు వార‌సులు మేం.. మేం అంటూ కొంద‌రు ముందుకొచ్చారు. అయితే వారంద‌రినీ కాద‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం జ‌య‌లలిత అంద‌రి అమ్మ అని.. అమ్మ ఆస్తుల‌న్నీ ప్ర‌భుత్వానికే చెందుతాయ‌ని ఆర్డినెన్స్ జారీ చేసి మ‌రీ ప్ర‌క‌టించింది. ఆ ఆర్డినెన్స్‌కు తాజాగా త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ భన్వారీలాల్ పురోమిత్ ఆమోద ముద్ర వేశారు. ఇక జ‌య‌లలిత‌కు సంబంధించిన ఆస్తుల‌న్నీ ప్ర‌భుత్వానివేన‌ని తేలింది. ఈ మేర‌కు రాజ్‌భ‌వ‌న్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

చెన్నైలోని పోయెస్ గార్డెన్‌ లో జ‌య‌ల‌లిత నివ‌సించేవారు. అధికార గృహంగా ఆ భ‌వ‌నాన్నే వాడేవారు. ఆ భ‌వ‌నం సొంతం చేసుకోవటానికి చట్టపరమైన వారసుల మధ్య పరిష్కారం కుదరలేదు. దీంతో తాత్కాలికంగా ఆ భ‌వ‌నం స్వాధీనం చేసుకునేలా రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఆ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోద ముద్ర వేయ‌డంతో ఇక పోయెస్ గార్డెన్ నిర్వహణ ప్ర‌భుత్వం చేతిలోకి వెళ్లింది.

ఆ ఆర్డినెన్స్‌లో ఈ భ‌వ‌నం నిర్వ‌హ‌ణ ముఖ్య‌మంత్రి నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి - సమాచార శాఖ మంత్రి - సమాచార శాఖ కార్యదర్శి ధర్మకర్తలుగా ట్రస్టును ఏర్పాటుచేసేందుకు వీలుగా ఆర్డినెన్స్‌ ను జారీ చేశారు. ఆ ట్ర‌స్ట్ పోయెస్ గార్డెన్‌ ను అమ్మ స్మార‌క కేంద్రంగా - మ్యూజియంగా రూపుదిద్దేందుకు నిర్ణ‌యం తీసుకుంది.