Begin typing your search above and press return to search.

అమ్మ ఖాతాలో ఠంచ‌న్ గా డ‌బ్బులేస్తున్న‌దెవ‌రు?

By:  Tupaki Desk   |   28 Jan 2019 5:09 AM GMT
అమ్మ ఖాతాలో ఠంచ‌న్ గా డ‌బ్బులేస్తున్న‌దెవ‌రు?
X
అమ్మ‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర అంశం మరొక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. త‌మిళ‌నాడు అమ్మ క‌మ్ దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణించి రెండేళ్లు. అయితే.. ఆమె బ్యాంక్ ఖాతాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉన్నాయి. ప్ర‌తి నెల క్ర‌మం త‌ప్ప‌కుండా న‌గ‌దు జ‌మ అవుతోన్న విష‌యాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. జ‌య‌ల‌లిత‌కు ఉన్న ఆస్తుల లెక్క చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

ఆ ఆస్తుల‌కు సంబంధించి అద్దెకు ఉన్న వారు.. అమ్మ లేకున్నా ఆమెకు తాము చెల్లించాల్సిన మొత్తాల్ని మాత్రం ప్ర‌తి నెలా క్ర‌మం త‌ప్ప‌కుండా బ్యాంకుల్లో జ‌మ చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. అమ్మ ఆస్తిప‌న్నులు చెల్లించ‌ని కార‌ణంగా ఆదాయ‌ప‌న్ను శాఖ ఇటీవ‌ల ఆమెకు చెందిన నాలుగు స్థిరాస్తుల్ని అటాచ్ చేసింది.

అమ్మ మ‌ర‌ణించే నాటికి ఆస్తిప‌న్నుల రూపంలో ఆమె చెల్లించాల్సిన మొత్తం రూ.20 కోట్ల‌కు దాటిన‌ట్లుగా తెలుస్తోంది. ఆమె మ‌ర‌ణం త‌ర్వాత ఆమె అధికారిక వార‌సులు ఎవ‌ర‌న్న విష‌యంపై క్లారిటీ లేక‌పోవ‌టంతో ఆమె ఆస్తుల‌కు సంబంధించిన ఆస్తిప‌న్నును చెల్లించ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్నారు. దీంతో.. చ‌ట్టం త‌న‌ప‌ని తాను చేసుకుపోయే రీతిలో.. త‌మ‌కున్న బ‌కాయిల‌కు ఆస్తుల్ని అటాచ్ చేసుకుంటూ పోతున్నారు అధికారులు.

ఆస్తుల అటాచ్ మెంట్‌ కు బ‌దులుగా అమ్మ చెల్లించాల్సిన మొత్తాల్ని ఆమె బ్యాంకు ఖాతాల్లో ఉన్న న‌గ‌దును ప్ర‌భుత్వ ఖాతాల‌కు మ‌ళ్లిస్తే స‌రిపోతుంది క‌దా? అమ్మ లేదు కాబ‌ట్టి ఆమె ఆస్తుల్ని అటాచ్ చేస్తున్నారు కానీ.. అదే అమ్మ ఉండి ఉంటే.. ఆమె బ‌కాయిలు ఎన్ని వంద‌ల కోట్లు పెండింగ్‌ లో ఉన్నా.. అడిగే సాహ‌సం చేసేవారంటారా?