Begin typing your search above and press return to search.

జయ మరణం... పది ప్రశ్నలు

By:  Tupaki Desk   |   8 Dec 2016 4:13 PM GMT
జయ మరణం... పది ప్రశ్నలు
X
75 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నా ఆరోగ్యం మెరుగుపడక తమిళనాడు ప్రజలను అనాథలను చేసి వెళ్లి పోయిన అమ్మ మరణం వెనుక ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు జయకు ఏమైంది... ఎందుకు అన్ని రోజులు చికిత్స అందించాల్సి వచ్చింది.. అయినా ఎందుకు ఫలితం లేకపోయింది.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బతికించుకోలేకపోయినంతగా మన వైద్యం దిగజారిపోయిందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

- సాధారణ జ్వరం, డీహైడ్రేషన్ తో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని మొదట్లో చెప్పారు. అలాంటప్పుడు 75 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స ఎందుకు అవసరమైంది?

- అక్టోబరు 21న జయ పరిస్థితి మెరుగైందని చెప్పారు. నవంబరు 4న ఆమె పూర్తిగా కోలుకున్నారని ఆసుపత్రి ఛైర్మన్ పీసీ రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఇంటికి ఎప్పుడు వెళ్లాలన్నది ఆమె ఇష్టమేనన్నారు. జయ మాట్లాడుతున్నారని నవంబరు 8న చెప్పారు. అయినా ఎందుకిలా జరిగింది.?

- మళ్లీ నవంబరు 12న అపోలో హాస్పిటల్ మరో మాట చెప్పింది. డిశ్చార్జి తేదీ ఇంకా నిర్ణయించాలంది. ఇంతకీ ఆమె ఎప్పుడు పూర్తిగా కోలుకున్నారు.. అయినా అప్పుడు ఎందుకు డిశ్చార్జి చేయలేదు.

- జయకు చికిత్స చేస్తున్న చిత్రాలు కానీ, ఆమె మాట్లాడిన విషయాలు కానీ ఏమీ ఎందుకు బయటపెట్టలేదు.

- జయ మాట్లాడుతున్నారని నవంబరు 8న హాస్పిటల్ యాజమాన్యం చెప్పింది.. కానీ, నవంబరు 25న పన్నీర్ సెల్వం చెప్పిన మాట అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. జయ ట్రాకియోస్టమీ ట్యూబ్ వాల్వ్ ద్వారా మాట్లాడుతున్నారని చెప్పారు. ఎందుకీ తేడా..

- జయ ఆసుపత్రిలో ఉన్నన్నాళ్లు ఎవరు పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించారు?

- ఆమె హాస్పిటల్ లో ఉన్న 75 రోజుల్లో ఎవరినీ రానివ్వలేదెందుకు? ఆమెను ఐసీయూ నుంచి ప్రయివేటు రూంకి మార్చిన తరువాత కూడా ఎందుకు రానివ్వలేదు.

- జయకు కార్డియాక్ అరెస్ట అని చెప్పిన తరువాత ఈ రాజకీయ సమీకరణాలు చోటుచేసుకోవడం వెనుక ఉన్నదెవరు.. ఎవరి ఆదేశాలతో నిర్ణయాలు తీసుకున్నారు?

- జయ మరణించారని ప్రకటించడానికి ముందే అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు సమావేశమై కొత్త సీఎంను ఎందుకు ఎన్నుకున్నారు. ఆమె మరణానికి ముందే ఎందుకిలా చేశారు.. లేదంటే అప్పటికే ఆమె మరణించారా?

- జయ మరణాన్ని ప్రకటించకముందే కేంద్ర మంత్రులు, గవర్నరు వంటివారు హుటాహుటిన వచ్చివాలడానికి గల కారణమేంటి.. అంటే అధికారికంగా ప్రకటించడానికి ముందే జయ మరణించారా?

... ప్రజల్లో ఇలాంటి ఎన్నో సందేహాలున్నాయి. వీటిలో కొన్నిటికైనా తమిళనాడు ప్రభుత్వం, అన్నా డీఎంకే పార్టీ సమాధానం చెబితేనే జనం వారిని విశ్వసించే అవకాశముంది. లేదంటే తమ అమ్మను ఏం చేశారు.. ఎవరిదా పాపం అన్న సందేహాలు వారి గుండెల్లో నాటుకుపోవడం ఖాయం.