Begin typing your search above and press return to search.

'అమ్మ' మృతి కేసులో కీల‌క మ‌లుపు!

By:  Tupaki Desk   |   18 Aug 2018 4:38 PM GMT
అమ్మ మృతి కేసులో కీల‌క మ‌లుపు!
X
త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మృతిపై గ‌తంలో త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు అనేక అనుమానాలు లేవనెత్తిన సంగ‌తి తెలిసిందే. అమ్మ మ‌ర‌ణం వెనుక‌ మ‌న్నార్ గుడి మాఫియా ఉంద‌ని - అమ్మ‌కు చికిత్స జ‌రుగుతున్న ఆమె ఉన్న అంత‌స్తులోకి గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు సహా అమిత్‌ షా - రాహుల్‌ గాంధీ - అరుణ జైట్లీల‌ను కూడా లోప‌లికి రానివ్వ‌కుండా శశికళ అడ్డుకున్నారని అన్నాడీఎంకే కీలక నేత దిండిగల్‌ శ్రీనివాస్ గ‌తంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అమ్మ మృతిపై త‌నకు అనుమానాలున్నాయ‌ని ప‌న్నీర్ సెల్వం కూడా ఆరోపించారు. ఈ క్ర‌మంలోనే జయలలిత మరణం వెనుక గల కారణాలు తెలుసుకునేందుకు... రిటైర్డ్‌ జడ్జి ఎ. ఆర్ముగ‌ స్వామి నేతృత్వంలో ఓ విచారణ కమిషన్ 2017లో ఏర్పాటైన సంగ‌తి తెలిసిందే. జయ చికిత్స పొందుతున్నప్పుడు ఆమె జ్యూస్ తాగుతున్న‌ట్లు శశికళ విడుద‌ల చేసిన ఓ వీడియో ఫేక్ అని కొద్దిరోజుల క్రితం తేలిన విష‌యం క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అమ్మ మృతిపై విచార‌ణ కీల‌క‌మ‌లుపు తిరిగింది. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో జయలలితను పర్యవేక్షించిన ముగ్గురు ఎయిమ్స్‌ డాక్టర్లకు ఆర్ముగ‌ స్వామి నోటీసులు జారీ చేసింది.

జ‌య‌ల‌లిత చికిత్స పొందుతున్న స‌మ‌యంలో శ‌శిక‌ళ ఎవ‌రినీ లోప‌లికి రానివ్వలేద‌న్న సంగ‌తి తెలిసిందే. జ‌య‌ల‌లిత ఆసుప‌త్రిలో చేరినప్ప‌టి నుంచి మరణించే రోజు వరకు....జీసీ ఖిల్ననీ (పల్మనాలజీ విభాగం) - అంజన్‌ త్రిఖా(ఎనిస్థీయాలజీ ప్రొఫెసర్‌ ) - నితీష్‌ నాయక్‌(కార్డియాలజీ విభాగం ప్రొఫెసర్‌)లు వైద్య నిపుణుల బృందం ‘అమ్మ’ ఆరోగ్య పరిస్థితిని ద‌గ్గ‌రుండి పర్యవేక్షించింది. ఈ క్ర‌మంలో అమ్మ‌కు చికిత్స అందించిన ముగ్గురు ఎయిమ్స్‌ డాక్టర్లు....ఈ విచార‌ణ‌లో కీల‌కంగా మారారు. దీంతో, వారికి ఆర్ముగం క‌మిష‌న్ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 23 - 24 తేదీల్లో ఆ ముగ్గురు వైద్యులు విచారణకు హాజరు కావాలని ఆర్ముగం క‌మిష‌న్ ఆదేశించింది. దీంతో, ఆ ముగ్గురు వైద్యులు ఎటువంటి స‌మాచారం వెల్ల‌డించ‌బోతున్నార‌న్న సంగ‌తి త‌మిళ‌నాట తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.