Begin typing your search above and press return to search.

ఆవిడ కోరికలు తీరిస్తేనే అమరావతికి వస్తారట

By:  Tupaki Desk   |   17 Oct 2015 8:54 AM GMT
ఆవిడ కోరికలు తీరిస్తేనే అమరావతికి వస్తారట
X
అమరావతి శంకుస్థాపనకు ఆంధ్రప్రదేశ్ ఎంతో మర్యాద పూర్వకంగా ఆహ్వానిస్తున్నా ఒక్కొక్కరు ఒక్కో రకమైన స్పందన కనబరుస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అయితే తాను రావాలంటే మా డిమాండ్లు తీర్చండి అంటూ షరతులు కూడా పెడుతున్నారు. దేశాల మధ్య దౌత్య షరతుల్లా రాష్ట్రాల్లోనూ దౌత్య నీతి, విధానాలు తీసుకొస్తుండడం ఆసక్తి కలిగిస్తోంది.

ఏపీ రాజధాని శంకుస్థాపనకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగానే తమిళనాడు సీఎం జయలలితకూ ఆహ్వానం పంపించారు. శంకుస్థాపన కార్యక్ర మానికి గౌరవ అతిథిగా హాజరుకావాల్సిందిగా జయలలితను చంద్రబాబు ఆహ్వానించారు. దీనికి ఆమె ప్రతిస్పందిస్తూ... 'ఆంధ్రా జైలులో ఉన్న తమ రాష్ట్రానికి చెందిన 516 మంది ఎర్ర చందనం కూలీలను విడిచిపెడితేనే వస్తాను' అని షరతు పెడుతూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో చంద్ర బాబు అవాక్కయ్యారట.

శేషాచలం అడవుల్లో తమిళనాడుకు చెందిన 20 మంది కూలీలను పోలీసులు ఎన్ కౌంటర్ చేసినప్పటి నుంచి జయలలిత కారాలు మిరియాలు నూరుతున్నారు. అవకాశం దొరికినప్పుడంతా ఆ అంశాన్ని ముడిపెడుతున్నారు. మొన్నటికి మొన్న తెలుగు భాష విషయంలో ఏపీ తమిళనాడుకు లేఖ రాసినప్పుడు కూడా అటునుంచి ఇదేఅంశంపై డిమాండ్లు వచ్చాయి. తాజాగా అమరావతి ఆహ్వానంపైనా ఇలా డిమాండు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే... తమిళనాడులో ఉన్న పరిస్థితుల దృష్ట్యా జయలలిత అలా వ్యవహరించి ఉంటారని భావిస్తున్నారు. చంద్రబాబు పిలవగానే ఏపీకి ఆమె వస్తే అక్కడి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదముంది. అందుకే ఆమె ఏపీ పరంగా తాము ఎందుర్కొంటున్న ఇబ్బందులపై మాట్లాడి ప్రజల వద్ద మార్కులు కొట్టేసేందుకే ఇలా వ్యవహరించారని తెలుస్తోంది.