Begin typing your search above and press return to search.

ఆ ఫొటో జయలలితది కాదు మొర్రో..

By:  Tupaki Desk   |   5 Oct 2016 7:56 AM GMT
ఆ ఫొటో జయలలితది కాదు మొర్రో..
X
సోషల్ మీడియా ఊపందుకున్నాక ఏది వాస్తవమో.. ఏది అబద్ధమో తెలియని కన్ఫ్యూజన్ బాగా పెరిగిపోతోంది. కావాలనే ఏదో ఒక తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి వినోదం చూడ్డం జనాలకు బాగా అలవాటైపోయింది. ఐతే అవి చిన్న చిన్న విషయాలైతే వచ్చిన ఇబ్బందేమీ లేదు. కానీ జనాల ఎమోషన్లతో ముడిపడ్డ విషయాలైతేనే సమస్య. ప్రస్తుతం తమిళనాడును కుదిపేస్తున్న విషయం.. జయలలిత అనారోగ్యం. జయ అనారోగ్యం మరీ అంత తీవ్రమైందేమీ కాదని.. ఆమె కోలుకుంటున్నారని సన్నిహితులు.. వైద్యులు చెబుతున్నా సరే.. మరో రకమైన ప్రచారం ఆగట్లేదు. తమిళనాడు ముఖ్యమంత్రి ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నారని.. చావుబతుకులతో పోరాడుతున్నారని సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం సాగుతోంది.

అంతటితో ఆగకుండా దానికి ప్రూఫ్స్ ఇవిగో అంటూ కొన్ని ఫోటోల్ని కూడా ప్రచారంలోకి తెచ్చేస్తున్నారు. ఐసీయూలో వెంటిలేటర్ మీద తీసుకుంటున్న జయలలిత అంటూ రెండు రోజులుగా ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. లాంగ్ షాట్లో తీసిన ఆ ఫొటో చూస్తుంటే అందులో ఉన్నది జయలలితే అనుకునేలాగే ఉంది. కానీ ఆ ఫొటో ఆమెది కానే కాదట. అది ఫేక్ ఫొటో అని నిర్ధారణ అయింది. 2009లో రోచెస్టర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎవరో పేషెంటుకు సంబంధించి తీసిన ఫొటో అదట. అసలే తమిళనాట అమ్మ అభిమానులు తీవ్ర ఆందోళనలో ఉంటే.. వారి భావోద్వేగాలతో ఆడుకుంటూ ఇలాంటి ఫొటోలు షేర్ చేయడం ఎంత వరకు సబబో నెటిజన్లు ఆలోచించుకోవాలి. మామూలుగా సెలబ్రెటీల అనారోగ్యం గురించి గోప్యంగా ఉంచేది అభిమానుల్ని దృష్టిలో ఉంచుకునే. తమ ఆరాధ్యులకు ఏమైనా అయితే వాళ్లు తట్టుకోలేక అఘాయిత్యాలకు పాల్పడవచ్చు. కుంగిపోవచ్చు. అందుకే ఇలాంటి విషయాల్లో సంయమనం పాటించడం అవసరం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/