Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్: ‘అమ్మ’కు ఏమైంది?

By:  Tupaki Desk   |   2 Oct 2016 10:19 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్: ‘అమ్మ’కు ఏమైంది?
X
‘అమ్మ’ అనే బిరుదును తన బ్రాండ్ గా మార్చుకొని.. తమిళుల మనసుల్ని దోచుకున్న తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి.. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడామె తాజా పరిస్థితి ఏమిటి? కోమాలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం ఎంత? అత్యుత్సాహంతో కొందరైతే నాలుగైదు అడుగులు ముందుకేసి.. ఆమె ఇక లేరంటూ బాధ్యతారాహిత్యంతో చేస్తున్న కామెంట్లు ఎందుకు వస్తున్నాయి? అసలు నిజం ఏమిటి? ఆమె ఇప్పుడెలా ఉన్నరన్న అంశాలపై వాస్తవిక దృష్టి కోణంతో.. కాస్తంత లాజిక్ ఉపయోగించి చూసినప్పుడు కొన్ని విషయాలు బోధ పడతాయి.

తమిళనాడుకు చెందిన సీనియర్ జర్నలిస్టులు కొందరు.. కొందరు రాజకీయ నేతలు చెప్పిన మాటలు.. వారి వాదనల ఆధారంగా ఈ కథనాన్ని రాయటం జరిగింది. ఇక.. నేరుగా విషయంలోకి వెళితే.. అమ్మ ఆరోగ్యం ఎలా ఉందన్న ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. దాదాపు పదకొండు రోజుల క్రితం అర్థరాత్రి వేళ అమ్మ ఆరోగ్యం సరిగా లేదంటూ హుటాహుటిన చెన్నై అపోలో ఆసుపత్రికి చేర్చారు. ఈ సందర్భంగా అమ్మకున్న అనారోగ్యం ఏమిటంటే.. తీవ్రమైన జ్వరం.. డీహైడ్రేషన్ అని మాత్రం చెప్పారు. ఈ చిన్న అనారోగ్య సమస్యలకు... వైద్యులు కిందా మీదా పడటం పలువురిని విస్మయానికి గురి చేసింది.

ఈ రెండు సమస్యల్ని సెట్ చేసేందుకు లండన్ నుంచి ప్రత్యేక వైద్యుడ్ని అపోలో ఆసుపత్రి పిలిపించింది. దీంతో.. అమ్మకు జ్వరం కాదు కానీ అంతకు మించిన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారన్న విషయం స్పష్టమైంది. ఇక.. తాజాగా ప్రచారం జరుగుతున్న అంశాల్ని చూస్తే.. దీనికి గుట్టుగా ఉండే అలవాటు ఉన్న అన్నాడీఎంకే పార్టీ వైఖరే కారణంగా చెప్పాలి. మిగిలిన రాజకీయ పార్టీలతో పోలిస్తే.. తమిళనాడు రాజకీయపార్టీల్లో గుట్టు ఎక్కువ. ప్రతి విషయాన్ని దాచే ప్రయత్నం చేస్తారే తప్పించి.. బయటకు చెప్పటానికి ఇష్టపడరు. ఈ వైఖరి మిగిలిన తమిళ పార్టీలతో పోలిస్తే.. అన్నాడీఎంకేలో చాలా ఎక్కువ.

ఈ వైఖరి అమ్మ ఆరోగ్యంపై ఊహాగానాలు షురూ అయ్యేలా మొదలైందని చెప్పాలి. ఇక.. అమ్మ దగ్గరకు నలుగురైదుగురు తప్పించి వేరెవరూ వెళ్లని పరిస్థితి. మొనగాడు లాంటి నేత సైతం ఆసుపత్రి లోపలకు వెళ్లటం తప్పించి.. అమ్మ దర్శనభాగ్యం లభించే పరిస్థితి లేదు. ఎవరినీ అనుమతించకుండా ఉండటంతో జయలలిత నెచ్చెలి శశికళ ఉండనే ఉన్నారు.

ఇక.. ఆసుపత్రిలో ఆమె ఆరోగ్యం ఎలా ఉందన్న విషయం బయటకు రాకుండా ఉండేందుకు వీలుగా.. వైద్యులపై భారీ నియంత్రణ విధించటమేకాదు.. అపోలో ఆసుపత్రిలో జయను ఉంచిన ఫోర్ల్ మొత్తాన్ని ఖాళీ చేయించేశారు. దాదాపు 80కి పైగా బెడ్స్ ఉన్న ఆ ఫ్లోర్ లో అమ్మ తప్పించి మరెవరూ లేకపోవటం గమనార్హం. పరిమిత సంఖ్యలో వెళ్లే వారికి తప్పించి.. అమ్మఆరోగ్యం గురించి అసలు విషయం బయటకు వచ్చే ఛాన్స్ లేదు. ఇక.. అమ్మ దగ్గరకు వెళ్లే నలుగురు.. ప్రాణాలు విడవటానికైనా ఇష్టపడతారు కానీ.. అమ్మకు సంబంధించి తమకు తెలిసిన ఏ విషయాన్ని పెదవి దాటటానికి అస్సలు ఇష్టపడరు.

ఇక.. అమ్మకు ఏదో అయిపోయిందన్న వాదనలోకి వెళ్లి.. క్రాస్ చెక్ చేస్తే.. నిజంగా అమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉందనుకుంటే.. తమిళనాడు వ్యాప్తంగా పోలీస్ ఫోర్స్ ను అలెర్ట్ చేయటం ఖాయం. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. అమ్మకు ఏదైనా అయ్యిందన్న విషయం రేఖా మాత్రంగా తెలిసినా.. ఆమెకు వీరాభిమానులైన మన్నార్ కుడి వర్గీయులు సృష్టించే హడావుడి..విధ్వంసం తీవ్రస్థాయిలో ఉంటుంది. నిత్యం అమ్మ గురించి ఆరా తీస్తూ..ఆమెపై ఈగ వాలేందుకు సైతం ఇష్టపడని.. వారు ఇంత కామ్ గా ఉన్నారంటే అమ్మ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు.

మరో కీలక అంశం ఏమిటంటే.. నిజంగానే అమ్మ ఆరోగ్యం విషమంగా ఉందనే అనుకుందాం. అలాంటి వేళ రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ వెళ్లి.. ఆమెను స్వయంగా చూసి వచ్చి.. ఆమె కోలుకుంటున్నారని చెప్పటంతోనే జయ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేస్తుందని చెబుతున్నారు. ఎందుకంటే..నిజంగానే ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండి ఉంటే.. వైద్యుల మాటను విద్యాసాగర్ కోట్ చేసే వారే కానీ.. తనకు తాను జయ కోలుకుంటున్నారన్న మాట చెప్పే వారు కాదు కదా? అన్నది ఒక ప్రశ్న.

ఇక.. జయ కోలుకోవాలని ఆమెపార్టీ నేతలు.. అభిమానులు.. కార్యకర్తలు చేస్తున్న హడావుడి తప్పించి.. తమిళనాడు వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేయటం.. ఆసుపత్రి చుట్టు అదనపు భద్రతా బలగాల్ని ఏర్పాటు చేయకపోవటం చూస్తే కూడా అమ్మ ఆరోగ్యంపై హైరానా పడాల్సినంత పరిస్థితి లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక.. ఆమె ఇక లేరంటూ సాగుతున్న దుష్ప్రచారం విషయంలోకే వెళితే.. నిజంగా అలాంటిది జరిగితే (బుధవారం అంటూ సోషల్ మీడియాలో విష ప్రచారం సాగుతోంది) ఆ విషయాన్ని అప్పటికప్పుడు బయట పెట్టటం సాధ్యం కాదనే అనుకున్నా.. శనివారం సాయంత్రమో.. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆ ప్రకటన చేసేవారని.. దీంతో కార్యాలయాలకు వెళ్లి వచ్చేవారితో పాటు.. జనసంచారానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యేవి కావన్నది వాదన. శనివారం రాత్రి ప్రకటిస్తే.. ఆదివారం సెలవు కాబట్టి పరిస్థితి కంట్రోల్ చేసే వీలుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. కానీ.. అలాంటిదేమీ చోటు చేసుకోలేదంటే.. అమ్మకు ఎలాంటి ఇబ్బంది లేదన్నది స్పష్టమవుతుందని చెబుతున్నారు. ఎవరికి వారు.. అర్థంలేని వాదనలు వినిపించేకన్నా.. జరుగుతున్న పరిణామాల్ని లాజిక్ గా చూస్తే.. మరో విషయం కూడా ఉంది. అమ్మకు అనుకోనిది ఏమైనా జరిగి ఉంటే.. భావోద్వేగానికి గురయ్యే ప్రజలతో ఇబ్బంది అనుకుంటే.. అలాంటివి చోటు చేసుకోకుండా నిలువరించటానికి వీలుగా.. యుద్ధప్రాతిపదికన భద్రతను కట్టుదిట్టం చేసే వారు. కానీ.. అలాంటిదేమీ చోటు చేసుకోలేదంటేనే అమ్మకు ఓకే అని చెప్పొచ్చు. సో.. అమ్మకు సంబంధించి తొందరపడి ఒక నిర్ణయానికి రావటం ఏ మాత్రం సరికాదని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/