Begin typing your search above and press return to search.

దిన‌క‌ర‌న్‌ ను గెలిపించిన అమ్మ వీడియో?

By:  Tupaki Desk   |   24 Dec 2017 10:08 AM GMT
దిన‌క‌ర‌న్‌ ను గెలిపించిన అమ్మ వీడియో?
X
ఊహించ‌నిరీతిలో త‌మిళుల తీర్పు వ‌చ్చింది. ఒక‌సారి పెండింగ్ ప‌డి.. నాట‌కీయ ప‌రిణామాల న‌డుమ జ‌రిగిన ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ఒక కొలిక్కి వ‌చ్చింది. ప్ర‌త్య‌ర్థుల‌కు ఏ మాత్రం అంద‌నంత భారీ వ్య‌త్యాసంతో గెలుపు దిశ‌గా దూసుకెళుతున్నారు దిన‌క‌ర‌న్‌. చిన్న‌మ్మ మేన‌ల్లుడిగా సుప‌రిచిత‌మైన దిన‌క‌ర‌న్‌ ను.. ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగినా.. ఆర్కేన‌గ‌ర్ ప్ర‌జ‌లు అభిమానించి..గెలిపించ‌టం ద్వారా మిగిలిన రాజ‌కీయ పార్టీల‌కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేశారు.

ఒక్కో ఓటుకు దాదాపు 5 నుంచి రూ.10వేల వ‌ర‌కు సైతం ఇచ్చేసినట్లుగా ఆరోప‌న‌లు ఎదుర్కొంటున్న దిన‌క‌ర‌న్ ఎందుకు గెలిచాడు? ఎలా గెలిచాడు? అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చిన్న‌మ్మ‌.. ఆమె సంబంధీకులు అంటే చాలు.. ఒళ్లు మండిపోయే ఆమె అభిమానులు.. చిన్న‌మ్మ మేన‌ల్లుడ్ని బ‌రిలోకి దింపితే త‌మిళ ప్ర‌జ‌లు ఎందుకు ఓటు వేశారు? అంత భారీ మెజార్టీతో ఎలా గెలిపించారు? అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

వాస్త‌వానికి ఉప ఎన్నిక‌కు కాస్త ముందు ఓ టీవీ ఛాన‌ల్ నిర్వ‌హించిన స‌ర్వేలో దిన‌క‌ర‌న్ గెలిచే అవ‌కాశ‌మే లేద‌ని తేల్చేశారు. అలాంటిది ఆఖ‌రి క్ష‌ణాల్లో ఆర్కే ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని ఎవ‌రు మార్చారు? ఎలా మారారు? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. దిన‌క‌ర‌న్ విజ‌యం సంచ‌ల‌న‌మే కాదు..విస్మ‌యాన్ని రేకెత్తిస్తోంది.

ప‌లువురి అభిప్రాయాల ప్ర‌కారం చూస్తే.. దిన‌క‌ర‌న్ గెలుపున‌కు.. చిన్న‌మ్మ వ‌ర్గానికి వెట్రివేల్ అమ్మ‌కు సంబంధించి వీడియోను విడుద‌ల చేయ‌టం లాభించింద‌ని చెబుతున్నారు. ఉప ఎన్నికల్లో కీల‌క‌మైన పోలింగ్ సంద‌ర్భంగా అమ్మ ఆసుప‌త్రిలో ఉన్న వీడియోను విడుద‌ల చేయ‌టం.. ఇంత‌కాలం త‌మ మీద వెల్లువెత్తిన అనుమానాల‌కు.. సందేహాల‌కు కార‌ణంగా భావించిన చిన్న‌మ్మ అండ్ కో హ‌స్తం ఏమీ లేద‌న్న భావ‌న క‌లిగేలా చేసింది.

ఈ వీడియోపై ఎన్నిక‌ల సంఘం ఆక‌గ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. ఈ వీడియో ఫుటేజ్ ను ఎవ‌రూ ప‌బ్లిసిటీ చేయ‌కూడ‌దంటూ ఎన్నిక‌ల సంఘం ఆంక్ష‌లు విధించింది. ఈసీ చెప్పిన‌ట్లు మీడియా జాగ్ర‌త్త‌గా ఉన్నా.. సోష‌ల్ మీడియాలో భారీగా వైర‌ల్ మారింది. కీల‌క‌మైన పోలింగ్‌ కు ఒక్క‌రోజు ముందు విడుద‌లైన ఈ వీడియో ప్ర‌కారం చూస్తే.. అపోలో ఆసుప‌త్రిలో అమ్మ అనారోగ్యంతో చేరిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఆసుప‌త్రిలో చేరే రాటిని స్పృహ లేద‌న్న‌ట్లు చెప్పిన మాట‌ల్లోనిజం లేద‌ని.. ఆమె కోలుకుంద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌య్యేలా చేసింది. అంతేకాదు.. అమ్మకు సంబంధించి వీడియో పుణ్య‌మా అని.. అమ్మ మ‌ర‌ణం మీద ప‌లువురికి ఉన్న సంశ‌యాల్ని చాలావ‌ర‌కూ త‌గ్గించాయి. అంతేకాదు.. అమ్మ మ‌ర‌నం మీద అనుమానాల్ని కొంతమేర నివృతి చేశాయ‌ని.. అదే దిన‌క‌ర‌న్ గెలుపుకు బాట‌లు వేశాయ‌ని చెబుతున్నారు.

అమ్మ మ‌ర‌ణం మీద సందేహాలు వ్య‌క్తం చేయ‌టం ద్వారా శ‌శిక‌ళ వ‌ర్గాన్ని దెబ్బ తీయాల‌న్న ప్లాన్ చేశార‌న్న భావ‌న ఆర్కే న‌గ‌ర్ ఓటర్ల‌కు క‌ల‌గ‌టంతో పాటు.. అలాంటి వ్యూహాన్నే విప‌క్ష డీఎంకే అనుస‌రించింద‌న్న వాద‌న వినిపిస్తోంది. అయితే.. పోలింగ్‌కు ఒక్క‌రోజు ముందు విడుద‌లైన వీడియో.. ఓట‌ర్ల మైండ్ సెట్ మొత్తాన్ని మార్చేలా చేసింద‌న్న అభిప్రాయాన్నిప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.