Begin typing your search above and press return to search.

పరిస్థితులే జయను నియంతను చేశాయి

By:  Tupaki Desk   |   6 Dec 2016 11:30 AM GMT
పరిస్థితులే జయను నియంతను చేశాయి
X
పేదల పట్ల కరుణామూర్తి అయిన అమ్మ జయలలిత తన శత్రువుల విషయంలో కాళికాదేవే. ఒకసారి ఆమె పగపడితే వారిపని అంతే. అంతేకాదు... స్వయంగా ఎలాంటి కట్టుబాట్లు విధించుకున్నా కూడా ఆరునూరైనా నూరు ఆరైనా వాటిని అతిక్రమించని వ్యక్తిత్వం ఆమెది.

అవమానించిన చోటే అధికారం

1989 ఎన్నికల్లో జయ వర్గం 27 స్థానాల్లో గెలిచి ఆమె ప్రతిపక్ష నాయకురాలయ్యారు. జానకి వర్గం అదే ఏడాది జయ పార్టీలో విలీనమైంది. ఆ సంవత్సరంలోనే తమిళనాడు అసెంబ్లీలో కనీవినీ ఎరుగని దుశ్శాసన పర్వం జరిగింది. సీఎం కరుణానిధి ప్రోద్బలంతో డీఎంకే ఎమ్మెల్యేలు సభలోనే ఆమె చీరలాగేందుకు ప్రయత్నించిన ఘటన దేశమంతా కలవరం రేపింది. ఆమెను కొట్టి గాయపరిచారు కూడా. చిరిగిన చీరతో అసెంబ్లీ నుంచి బయటకొచ్చిన ఆమె సీఎం పదవి చేపట్టేవరకు అసెంబ్లీలో అడుగుపెట్టనని భీషణ ప్రతిజ్ఞ చేశారు. అన్నట్లుగానే 1991లో సీఎం అయిన తరువాతే మళ్లీ సభలోకి వచ్చారు.

కరుణపై కాఠిన్యం

1996లో డీఎంకే ప్రభుత్వ హయాంలో అక్రమాస్తుల కేసులో జయ జైలుకి వెళ్లారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. ‘నేను ఎక్కడికైతే వెళ్లానో, నా ప్రత్యర్థుల్ని కూడా అక్కడికే పం పిస్తాను’ అని బహిరంగంగా జయ శపథం చేశారు. 2001లో జయ సీఎం అయ్యారు. అన్నట్టుగానే కరుణానిధిని అర్థరాత్రి అరెస్టు చేయించి, తనను ఉంచిన జైలు గదిలోనే పెట్టించారు.

బంగారమైనా డోన్ట్ కేర్

జయలలిత నివాసం నుంచి ఐటీ అధికారులు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొన్నారు. జయ ఇంట దొరికిన బంగారమంతా ఆమెకు బహుమతిగా లభించిందేనని డీఎంకే నేతలు ఎద్దేవా చేశారు. దీనిపై ఆగ్రహించిన జయ కేసు నుంచి బయటపడేవరకు, బంగారం ధరించబోమని భీకర ప్రతిజ్ఞ చేశారు.

వాజ్ పేయికి చుక్కలు చూపించి..

1998లో వాజ్‌పేయి ప్రభుత్వానికి జయ మద్దతు ప్రకటించారు. కానీ రాష్ట్రపతికి లేఖ సమర్పించేందుకు తిప్పలు పెట్టారు. ఆమె లేఖ ఇస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా రాష్ట్రపతిని కోరతానని వాజ్‌పేయి చెప్పారు. జయ తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యా యి. చివరకు ఆమె మద్దతు లేఖ ఇచ్చారు. అనంతర కాలంలో నాటి తమిళనాడు సీఎం కరుణానిధిని బర్తరఫ్‌ చేయాలని ఒత్తిడి తెచ్చారు. వాజ్‌పేయి అందుకు అంగీకరించకపోవడంతో ఆయనకు మద్దతు ఉపసంహరించారు. విశ్వాస పరీక్షలో ఒక్క ఓటుతో వాజ్‌పేయి ఓడిపోయారు.

ఉద్యోగుల మెడలు వంచిన ఏకైక సీఎం

ప్రపంచంలో ఎక్కడైనా ప్రభుత్వాలు ఉద్యోగులకు బెండ్ అవుతుంటాయి. కానీ... జయ మాత్రం ఉద్యోగులను వణికించారు. 2003 లో జయ సీఎంగా ఉన్నప్పుడు జీతభత్యాల పెంపు డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఆగ్రహించిన జయ ఎస్మా చట్టాన్ని ప్రయోగించి ఆ లక్ష మందిపై వేటు వేశారు. తొలగింపు తో ఖాళీ అయిన పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఉద్యోగులు లేకపోవడంతో ప్రభుత్వ కార్యక్రమాలు ఆగిపోకుండా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు సర్టిఫికెట్లతో వస్తే చాలు, ఉద్యోగంలో చేర్చుకునేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచంలో ఇంకెక్కడా కార్యనిర్వాహక వ్యవస్థకు ఇలాంటి షాక్ తగల్లేదు.

మీడియాకూ భయమే..

తనకు వ్యతిరేకంగా రాసిన మీడియాపైనా జయ ఉక్కుపాదం మోపేవారు. జయలలిత పాల్గొనే ఏ కార్యక్రమంలోనైనా మీడియా ప్రతినిధులు, కెమేరామేన్లు ఎవరెవరు వచ్చారు.. వారు ఏం చేస్తున్నారన్న నిఘా ఉంటుంది. వేదికపై నుంచి పదుల సంఖ్యలో వీడియో కెమేరాలు మీడియాను టార్గెట్ చేస్తాయి. మీడియాను చూసి అందరు భయపడితే తమిళనాడులో మాత్రం నేషనల్ మీడియాతో సైతం జయను చూసి భయపడుతుంది. వేళ్లూనుకునిపోయిన పత్రికాధిపతుల్ని సైతం పరుగులు పెట్టించిన వ్యక్తి జయ. దీంతో ఆఖరికి ఆమె తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనా, అసలేం జరిగిందో తెలుసుకుని రాసేందుకు సైతం తమిళ మీడియా జంకింది. ప్రభుత్వం, ఆసుపత్రి ఇచ్చిన ప్రకటనల్ని యధాతథంగా ప్రచురించడం మినహా జయ ఆరోగ్యంపై ‘పరిశోధనా కథనాలు’ రాసేందుకు సైతం ఇక్కడి మీడియా తటపటాయించింది.

నిజానికి జయది మెత్తని మనసని... కానీ, ఎంజీఆర్ మృతి సమయంలో జరిగిన అవమానం... శాసనసభలో చీర లాగడం వంటివి ఆమెను కఠినంగా మార్చేశాయని చెబుతారు. నియంతలా లేకుంటే నెగ్గుకు రాలేమని గుర్తించి ఆమె కఠిన శిలలా మారిపోయారని చెబుతారు. ఎంత నియంతలా వ్యవహరించినా ఆమె హృదయం మాత్రం సున్నితమని.. పేదలకోసం ఆమె ప్రవేశపెట్టిన ప్రతి పథకం ఆమె మనసేంటో చెప్పకనే చెబుతుందని అంటారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/