Begin typing your search above and press return to search.

అమ్మ లెక్కతో వంద మంది సిట్టింగ్ లకు షాక్

By:  Tupaki Desk   |   6 April 2016 3:07 PM IST
అమ్మ లెక్కతో వంద మంది సిట్టింగ్ లకు షాక్
X
అమ్మగా అందరికి సుపరిచితురాలైన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తాజాగా తీసుకున్న నిర్ణయం పార్టీ నేతలకు షాకింగ్ గా మారింది. అమ్మ తీసుకున్న నిర్ణయాన్ని మింగా లేక కక్కా లేక.. ఏం చేయాలో తోచక కిందామీదా పడిపోతున్నారు. గతానికి భిన్నంగా ఈసారీ అధికార పీఠం అమ్మదేనని సర్వేలన్నీ తేల్చి చెబుతున్న నేపథ్యంలో సాహసోపేతమైన నిర్ణయాల్ని తీసుకుంటున్నారు. మొన్నటికి మొన్న మిత్రపక్షాలకు ఏడంటే ఏడు స్థానాల్ని మాత్రమే ఇచ్చి.. వారి నోట మాట రాకుండా చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తన మార్క్ వేటు వేశారు.

ఈసారి ఎన్నికల్లో ఏకంగా వంద మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆమె పార్టీ టిక్కెట్టు ఇవ్వలేదు. ఇంత భారీగా సిట్టింగ్ లను పక్కన పెట్టటం తమిళనాడులో సంచలనంగా మారింది. ఆసక్తికరమైన మరో అంశం ఏమిటంటే.. సిట్టింగ్ లను పక్కన పెట్టిన వంద మందిలో 31 స్థానాల్లో మహిళలకు టిక్కెట్లు ఇచ్చారు. ఇక.. మిగిలిన అభ్యర్థుల్లో కూడా పార్టీ కోసం విపరీతంగా కష్టపడే వారు.. చిన్న చితకా నాయకులను ఏరికోరి మరీ టిక్కెట్లు ఇవ్వటం గమనార్హం.

ఎవరూ ఊహించలేని వారికి సీట్లు ఇస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్న అమ్మ గేమ్ ప్లాన్ ఏమిటన్నది అంతుబట్టనిదిగా ఉందన్న మాట వినిపిస్తోంది. అయితే.. తాజాగా జయలలిత ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను చూస్తే అర్థమయ్యే విషయం ఒక్కటే.. పార్టీ కోసం కష్టపడి పని చేయటం.. స్థానికంగా మాంచి పట్టున్న నాయకుల్ని ఆచితూచి ఎంపిక చేసిన వైనం కనిపిస్తుంది. నియోజకవర్గాల్లో మంచి పట్టున్న స్థానిక నేతలకు అవకాశం ఇవ్వటం ద్వారా.. తన ఇమేజ్.. స్థానికంగా ఉండే పట్టు కలిసి అద్భుత విజయం ఖాయమన్న లెక్కలో అమ్మ ఉన్నట్లు ఆమె ఎంపిక లెక్కగా ఉందని చెప్పొచ్చు.