Begin typing your search above and press return to search.

దెయ్యాల కొంపలా అమ్మనివాసం

By:  Tupaki Desk   |   27 May 2017 7:45 AM GMT
దెయ్యాల కొంపలా అమ్మనివాసం
X
అన్నాడీఎంకే అధినేత్రి, దివంగ‌త త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి జయలలిత నివాసం పొయెస్‌ గార్డెన్‌పై త‌మిళ మీడియా సంచ‌ల‌న క‌థ‌నాలు వెలువ‌రించింది. ఒకనాడు కళకళలాడిన పొయెస్‌ గార్డెన్‌ నేడు నిశ్శబ్దంగా మారిందని, దీపాల వెలుగులతో మెరిసిన భవనం చీకటి గుహ‌లా తయారవుతోందని వార్తలు వెలువడ్డాయి. తాళాలు వేసిన తలుపులు, మసక వెలుతురుతో కనిపించే పోర్టికో ఒక భయాన్ని రేకెత్తించేలా ఉంద‌ని పేర్కొంది. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే పొయెస్ గార్డెన్ ప్రస్తుతం దెయ్యాల కొంపలా మారుతోందని స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి.

త‌మిళ‌నాడు రాష్ట్ర ప్రభుత్వం పొయెస్‌ గార్డెన్‌ ను జయలలిత స్మారక మందిరంగా మార్చాలని భావిస్తోంది. అయితే ప‌రిపాల‌నమైన ముంద‌డుగు ప‌డ‌క‌పోవ‌డం, త‌గిన కార్యాచ‌ర‌ణ జ‌ర‌గ‌క‌పోవ‌డం, అన్నాడీఎంకే నేత‌ల మ‌ధ్య విబేధాల కార‌ణంగా అది ఆచ‌ర‌ణ రూపం దాల్చ‌లేదు. మ‌రోవైపు అమ్మ మ‌ర‌ణం అనంత‌రం ఆమె సన్నిహితురాలు శశికళ, ఆమె బంధువులు జైలుకు వెళ్లడంతో గత ఐదు నెలలుగా ఈ భవనం ఆలనాపాలనా చూసిన వారు లేకుండాపోయారు. దీనితో ప్రస్తుతం ఈ భవనం దెయ్యాల కొంపను తలపిస్తోంది. ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న ప్రైవేటు ఏజెన్సీలకు చెందిన సెక్యూరిటీ గార్డులు గార్డు రూమ్‌ దాటి లోపలికి వెళ్లే సాహసం చేయలేకపోతున్నారని త‌మిళ‌నాడు మీడియా విశ్లేషించింది.

అమ్మకు అత్యంత ప్రీతిపాత్ర‌మైన పొయెస్ గార్డెన్ ఆల‌నాపాల‌నా లేక ఇలా మారిపోవ‌డం చూసి జ‌య‌లలిత అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. బ్ర‌తికి ఉన్నంత కాలం అమ్మ పేరును జ‌పించిన నాయ‌కులు, ఆమె వార‌స‌త్వం కోసం పోటీ ప‌డుతూ ఇలాంటి ప‌రిస్థితికి కార‌ణమ‌వుతున్నార‌ని మండిప‌డుతున్నారు. అమ్మ కుటుంబ‌స‌భ్యులుగా చెప్పుకుంటున్న దీపా, దిన‌క‌ర‌న్‌లు సైతం పోయెస్ గార్డెన్ వైపు క‌న్నెత్తి చూడ‌క‌పోవ‌డం బాధాక‌ర‌మ‌ని వాపోతున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/