Begin typing your search above and press return to search.

‘అమ్మ’ మీటింగ్స్ కు రంగం సిద్ధమైంది

By:  Tupaki Desk   |   20 Nov 2016 6:01 AM GMT
‘అమ్మ’ మీటింగ్స్ కు రంగం సిద్ధమైంది
X
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 58 రోజులుగా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి.. అమ్మగా సుపరిచితురాలైన జయలలిత అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలోకి చేరి. ఇంత సుదీర్ఘకాలం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె వాస్తవ పరిస్థితి ఏమిటి? అన్నది ఇప్పటికి ఎవరికి తెలీని పరిస్థితి. తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆమెను.. సంపూర్ణ ఆరోగ్య‌వంతురాలిగా మార్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసిన వైద్యులు ఎట్టకేలకు సక్సెస్ అయినట్లే చెప్పాలి.

అమ్మ అనారోగ్యం.. చికిత్సకు సంబంధించి చాలానే ప్రచారాలు సాగినా.. అవన్నీ ఉత్త పుకార్లే అన్న విషయం చాలా సందర్బాల్లో రుజువైంది. చాలా మీడియా సంస్థలు అమ్మ అనారోగ్యంపై చాలానే కథనాలు ప్రసారం చేశాయి. పెద్ద మీడియా సంస్థలు సైతం తొందరపాటుతో అమ్మ అనారోగ్యానికి సంబంధించి ‘కోమా’లో ఉన్నట్లుగా కూడా చెప్పేశాయి. కానీ.. తుపాకీ మాత్రం అలాంటి పని అస్సలు చేయలేదు. వాస్తవాన్ని మాత్రమే చెప్పే ప్రయత్నం చేసింది.

గ్రౌండ్ రిపోర్ట్ ను కనుగొనేందుకు కొన్నిసార్లు క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనా.. అందరితో నారాయణ.. గుంపులో గోవిందా అన్న తీరులో కాకుండా.. నిజాన్ని.. వాస్తవాన్ని మాత్రమే పాఠకులకు చెప్పాలన్న సిద్ధాంతానికి కట్టుబడింది. తాజాగా అమ్మ ఆరోగ్యం చాలావరకూ మెరుగైందన్న మాటను చెబుతున్నారు. తాజాగా ఆమెను ఐసీయూ నుంచి విశాలమైన ఒక వార్డుకు తరలించారు.

58 రోజులుగా అపోలో ఆసుపత్రిలోనే ఉన్న ఆమె.. దీపావళికి ఇంటికి వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగినా.. అలాంటిదేమీ జరగలేదు. అమ్మ ఆరోగ్యం పూర్తిస్థాయిలో నయం కాకపోవటం.. ఇంటికి వెళితే ఆమెకు వైద్యసేవలు అందించే విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో ఆమెను డిశ్చార్జ్ చేయటానికి వైద్యులు ఒప్పుకోలేదు. తాజాగా మాత్రం పరిస్థితి మెరుగు కావటంతో ఆమెను ప్రత్యేక వార్డుకు తరలించారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అమ్మ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డు విశాలంగా ఉండటమే కాదు.. సమావేశాలు నిర్వహించుకోవటానికి అనువుగా తయారు చేయటం గమనార్హం. తాజాగా చోటు చేసుకుంటున్న ఏర్పాట్లు చూస్తే.. అపోలో ఆసుపత్రి మరికొద్ది రోజులు పాటు అమ్మకు పోయిస్ గార్డెన్ గా ఉండనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా ఏర్పాటు చేసిన గదిలో అన్ని రకాల వైద్యసేవలు అందించేందుకు వీలుగా ఉండటంతో పాటు.. అమ్మ కోరుకుంటే ఎవరితోనైనా సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు ఉన్నట్లు అపోలో వర్గాలు చెబుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/