Begin typing your search above and press return to search.

అమ్మ వేలిముద్ర‌పై వివాదమెందుకు?

By:  Tupaki Desk   |   1 Nov 2016 5:31 AM GMT
అమ్మ వేలిముద్ర‌పై వివాదమెందుకు?
X
అనారోగ్యం కార‌ణంగా నెల‌కు పైగా ఆసుప‌త్రిలోనే చికిత్స తీసుకుంటున్న అన్నాడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత... త‌న పార్టీ అభ్యర్థుల నామినేష‌న్ల‌పై వేసిన ఎడమ చేతి వేలి ముద్ర‌పై ఆ రాష్ట్రంలో పెను వివాద‌మే రేగింది. సెప్టెంబ‌రు 22న రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత తీవ్ర జ్వ‌రం - డీహైడ్రేష‌న్ కార‌ణంగా జ‌య త‌న నివాసంలో స్పృహ కోల్పోయారు. దీంతో జ‌య నివాసం పోయెస్ గార్డెన్‌ కు స‌మీపంలోని అపోలో ఆసుప‌త్రికి ఆమెను హుటాహుటీన త‌ర‌లించారు. ఇక నాటి నుంచి నేటి దాకా జ‌య ఆసుప‌త్రి బెడ్ దిగిన దాఖ‌లా లేదు. తొలుత అపోలో వైద్యులు - ఆ త‌ర్వాత లండ‌న్ వైద్యుడు డాక్ట‌ర్ రిచ‌ర్డ్ బిలే - ఆ త‌ర్వాత ఎయిమ్స్ వైద్యులు - చివ‌ర‌గా సింగపూర్ నుంచి వ‌చ్చిన ఫిజియోథెర‌పిస్టులు.. జ‌య‌కు సుదీర్ఘంగా చికిత్స అందిస్తున్నారు. దీపావ‌ళికి ముందు జ‌య ఆసుప‌త్రి నుండి డిశ్చార్జీ కానున్నార‌ని వార్త‌లు వెలువ‌డ్డా, ఇంకా అనారోగ్యం పూర్తిగా న‌యం కాని నేప‌థ్యంలో జ‌య ఆసుప‌త్రిలోనే ఉండిపోవాల్సి వ‌చ్చింది.

ఇదంతా బాగానే ఉన్నా... జ‌య ఆసుప‌త్రిలో ఉన్న స‌మ‌యంలోనే త‌మిళ‌నాడులోని అర‌వ‌కురిచ్చి - తంజావూరు - తిరుప్ప‌ర‌గుండ్రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌ర‌ప‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఉప ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ జారీ చేయ‌గా - జ‌య‌ల‌లిత త‌న పార్టీ అభ్య‌ర్థుల‌తో నామినేష‌న్ కూడా వేయించారు. అభ్య‌ర్థుల నామినేష‌న్ల‌పై పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంత‌కం త‌ప్ప‌నిస‌రి. ఆ సంత‌కం ఉంటేనే ఆయా అభ్యర్థులు ఆ పార్టీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన‌వారుగా ఎన్నిక‌ల క‌మిష‌న్ గుర్తిస్తుంది. ఆ పార్టీకి చెందిన గుర్తును కేటాయిస్తుంది. అయితే జ‌య ఆసుప‌త్రిలో ఉన్న నేప‌థ్యంలో ఆమె స‌ద‌రు నామినేష‌న్ ప‌త్రాల్లోని బీ ఫామ్‌ పై ఎడ‌మ చేతి బొట‌న‌వేలి ముద్ర వేశారు.

40 రోజుల పాటు జ‌రిగిన చికిత్స‌తో జ‌య ఆరోగ్యం మెరుగైంద‌ని వైద్యులు ప్ర‌క‌టించారు. అంతేకాకుండా ఆసుప‌త్రి బెడ్‌ పై ఎవ‌రి సాయం లేకుండానే లేచి కూర్చుంటున్న జ‌య... స్వ‌హ‌స్తాల‌తో ఆహారం తీసుకుంటున్నార‌ని కూడా డాక్ట‌ర్లు చెప్పారు. ఈ క్ర‌మంలో బీఫామ్ పై సంత‌కం చేసే అవ‌కాశాలున్నా. జ‌య అందుకు విరుద్ధంగా వేలి ముద్ర వేయ‌డ‌మెందుక‌ని విప‌క్షాలు స‌న్నాయి నొక్కులు నొక్కాయి. పీఎంకే అధినేత రాందాస్ ఈ విష‌యాన్ని మ‌రీ రాద్ధాంతం చేశారు. జ‌య వేలిముద్ర‌ను ఎన్నిక‌ల క‌మిష‌న్ అంగీక‌రించ‌డం వెనుక పెద్ద కుట్ర ఉంద‌ని ఆయ‌న ఆరోపించారు. ఎన్నిక‌ల సంఘం జ‌య‌కు అనుకూలంగా వ్య‌వ‌హరిస్తోంద‌ని కూడా ఆయ‌న ఓ ఆస‌క్తికర వాద‌న‌ను వినిపించారు.

ఇదిలా ఉంటే... జ‌య వేలిముద్ర‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం... రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నుంచి వివ‌ర‌ణ తీసుకున్న త‌ర్వాతే... అన్నాడీఎంకే అభ్య‌ర్థుల‌ బీఫామ్‌ల‌ను ధ్రువీక‌రించింది. ఇక జ‌య వేలిముద్ర వేయ‌డానికి గ‌ల కార‌ణాల‌ను ఆ స‌మ‌యంలో ప్ర‌త్య‌క్షంగా జ‌య ప‌క్క‌న ఉన్న అపోలో వైద్యుడు బాలాజీ స‌వివ‌రంగా ఓ ప్ర‌క‌ట‌న చేయాల్సి వ‌చ్చింది. కుడి చేతికి సెలైన్ బాటిల్ ఎక్కిస్తున్న కార‌ణంగా జ‌య ఎడ‌మ చేతి బొట‌న వేలి ముద్ర‌ను వేశార‌ని ఆయ‌న చెప్పారు. వేలి ముద్ర వేస్తున్న‌ప్పుడు జ‌య స్పృహ‌లోనే ఉన్నార‌ని, అభ్య‌ర్థుల పేర్ల‌ను ప‌రిశీలించిన త‌ర్వాతే జ‌య వేలి ముద్ర వేశార‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు. అయినా ఉప ఎన్నిక‌ల బీపామ్‌ ల‌పై జ‌య సంత‌కం చేస్తే ఏమిటి? వేలి ముద్ర వేస్తే ఏమిటి?... అన్న వాద‌న కూడా వినిపిస్తోంది. తీవ్ర అనారోగ్యంతో ఆసుప‌త్రిలో ఉన్న జ‌య ఆరోగ్యంతో తిరిగి రావాల‌ని కోరుకోవ‌డానికి బ‌దులుగా ఆమె వేలి ముద్ర‌ను కూడా రాజకీయం చేయ‌డంపై త‌మిళ తంబీలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/