Begin typing your search above and press return to search.

తెలుగువారి కోసం అమ్మ ఏం చేస్తోందంటే...

By:  Tupaki Desk   |   30 April 2016 6:58 AM GMT
తెలుగువారి కోసం అమ్మ ఏం చేస్తోందంటే...
X
తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ఇప్పటికే అన్ని పార్టీలు వివిధ పథకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఓటర్ల మనోభావాలకు సైతం పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో ఓట్లున్న తెలుగువారిని సైతం పార్టీలు టార్గెట్ చేశాయి. ప్రచారం సందర్భంగా పలు పార్టీలు కొన్నిచొట్ల తెలుగులోనూ ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగు వారిని ఓట్లను కొల్లగొట్టేందుకు జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే ముందడుగు వేసింది. ఆవడి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగు ఓటర్లు అధికంగా ఉన్నారు. వారిని ఆకట్టుకునేందుకు అన్నాడీఎంకే అభ్యర్థి మాఫోయ్ పాండియరాజన్ తెలుగులోనూ ఎన్నికల ప్రచార కరపత్రాన్ని పంపిణీ చేస్తున్నారు. అన్నివర్గాల వారికీ దగ్గరయ్యేందుకు ఆయన శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

చెన్నై సమీపంలో అన్ని భాషల ప్రజలు నియోజకవర్గంలో ఉండటంతో తమిళంతోపాటు తెలుగు - మలయాళం - హిందీ - ఆంగ్లంలో ప్రచార కరపత్రాలను ముద్రించారు. ప్రచారం చేసే ప్రాంతానికి తగ్గట్టు వాటిని పంపిణీ చేస్తున్నారు.తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఆ భాష వాటినే పంచి పెడుతున్నారు. దీంతో పాటు పార్టీలోని తెలుగు నాయకులను ఓటర్లకు చేరువ అయ్యేందుకు వెంట బెట్టుకొని వెళ్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో ప్రకటించేస్తున్నారు.

ఇదిలా ఉండగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేపై అన్నా డీఎంకే చీఫ్ జయలలిత తీవ్ర విమర్శలు చేశారు. తమ పోరాటం తమిళనాడును కబళించి తమ కుటుంబపాలన చేయాలని చూస్తున్న డీఎంకే నుంచి కాపాడాలన్నదే నని జయ అన్నారు. తమ పార్టీలో మాత్రమే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని, పేదలు - సామాన్య ప్రజలతో అధికారాన్ని పంచుకుంటామని జయలలిత పేర్కొ న్నారు. కుటుంబ పాలన ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. ఒక కుటుంబంలోనే అధికారం - రాజకీయ ప్రాబల్యం అధికంగా ఉండటం అనేవి అందరికీ సమాన అవకాశాలు అన్న మౌలిక ప్రజా స్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. అని ఆమె వ్యాఖ్యా నించారు. ఉచిత మిక్సర్లు - గ్రైండర్లు - అమ్మ క్యాంటిన్‌ లు - 20కిలోల ఉచిత బియ్యం - అమ్మ మందులు వంటి పథకాలను కొనసాగాలంటే తనకు మద్దతు ఇవ్వాలని జయలలిత కోరారు.