Begin typing your search above and press return to search.

ఆ ఇల్లే చిన్నమ్మను సీఎంను చేస్తుందా?

By:  Tupaki Desk   |   6 Feb 2017 5:30 PM GMT
ఆ ఇల్లే చిన్నమ్మను సీఎంను చేస్తుందా?
X
అంచనాలు నిజమయ్యాయి. ఊహాగానాలు వాస్తవాలుగా మారనున్నాయి. అనుకున్నట్లే.. మరి కొద్దిరోజుల్లో చిన్నమ్మ సీఎం కానున్నారు. అమ్మ మాదిరే చిన్నమ్మకు ఇమేజ్ లేకున్నా.. ఆమె ముఖ్యమంత్రి కావటం మీద ఆసక్తికర వాదన ఒకటి వినిపిస్తోంది. అమ్మ ఎంతో ముచ్చటపడి కట్టించుకున్న పోయెస్ గార్డెన్ లోని వేద నిలయమే చిన్నమ్మను సీఎంగా చేస్తుందన్న వాదన వినిపిస్తోంది.

1967లో కేవలం రూ.1.32లక్షలతో జయలలిత ఇప్పటి వేద నిలయం భవనాన్ని కొనుగోలు చేసినట్లుగా చెబుతారు. సినిమాల్లో తాను సంపాదించిన మొత్తంతో ఆమె ఈ భవనాన్ని కొనుగోలు చేశారు. తన తల్లి పేరు వచ్చేలా భవనానికి వేదనిలయంగా పేరు పెట్టి.. మొత్తంగా మార్చేసినట్లు చెబుతున్నారు. అమ్మ అధికారంలో ఉన్నా.. లేకున్నా పార్టీ నేతలు.. కార్యకర్తలతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉండేది.

చాలా తక్కువమందికి మాత్రమే ఇంట్లోకి ప్రవేశం ఉంటుందని చెప్పే వేద నిలయం లోపల ఎలా ఉంటుందో ఎవరికి తెలీదని చెబుతారు. దాదాపు 20 మంది ఇంట్లో పని చేస్తుంటారని చెబుతారు. అమ్మ మరణం తర్వాత వేద నిలయానికి పూర్వకళ ఉండదని కొందరు భావించేవారు. అయితే.. వేద నిలయంలో ఉంటే రాజభోగం పడుతుందని నమ్మే వాళ్లు ఉన్నారు. ఇందుకు తగ్గట్లే అమ్మ మరణం తర్వాత చిన్నమ్మ వేద నిలయంలో ఉండటం గమనార్హం.

కొందరి అంచనాలకు తగ్గట్లే చిన్నమ్మ పార్టీ మీదన పట్టు సాధించటమే కాదు.. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోనున్నారు. చిన్నమ్మ రాజయోగానికి వేద నిలయం కూడా కారణంగా చెబుతారు. జ్యోతిష్యం.. వాస్తు.. జాతకాల్ని భారీగా విశ్వసించే అమ్మ.. అందుకు తగ్గట్లే వేద నిలయాన్ని నిర్మించారని.. ఆ ఇంట్లో ఎవరు ఉంటే వారికి రాజయోగం తప్పదని.. అందుకే అమ్మ తర్వాత చిన్నమ్మ ఆ ఇంట్లో ఉండేందుకు మక్కువ చూపించి.. అనుకున్నది సాధించినట్లుగా భావిస్తున్నారు. జరుగుతున్న పరిణామాల్ని చూసినప్పుడు.. ఈ నమ్మకాల్ని నమ్మక తప్పదనే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/