Begin typing your search above and press return to search.

ఇప్పుడు వేద నిలయం ఎవరిది?

By:  Tupaki Desk   |   14 Feb 2017 8:33 AM GMT
ఇప్పుడు వేద నిలయం ఎవరిది?
X
అమ్మ వెళ్లిపోయింది. చిన్నమ్మ జైలుకు వెళ్లే టైమ్ దగ్గరపడింది. మరి.. అమ్మ ఎంతో ఇష్టంగా కట్టుకున్న వేద నిలయం ఎవరిది? అందులో ఎవరు ఉండనున్నారు? దశాబ్దాల తరబడి పవర్ స్టేషన్ గా ఉన్న వేదనిలయం ఇప్పుడు ఎవరూ లేనిది అవుతుందా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారుతుందని చెప్పాలి. సినీరంగంలో తాను తొలినాళ్లలో సంపాదించుకున్న మొత్తంతో వేదనిలయాన్ని జయలలిత కట్టుకున్నారు.

ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆమె తన ఇంటి నుంచే పరిపాలించారు కానీ.. బయటకువెళ్లలేదు. అమ్మ అనారోగ్యానికి గురయ్యే వరకూ వేదనిలయంలోనే ఉండేవారు. వేద నిలయాన్ని అమితంగా ఆరాధించే ఆమె.. అందులోకి ఎవరినీ రానిచ్చే వారు కాదు. చాలా తక్కువ మందికి మాత్రమే అందులో ప్రవేశం లభిస్తుంది.

అమ్మ మరణం తర్వాత వేద నిలయాన్ని తన చేతుల్లోకి తీసుకున్న శశికళ.. అందులోనే ఉండిపోయారు. అలా ఉన్నారేమిటన్న మాటను కూడా ఎవరూ అనలేదు. ఎప్పుడైతే.. పన్నీర్ కు.. చిన్నమ్మకు లెక్క తేడా వచ్చిందో అప్పుడు మాత్రమే వేదనిలయం ప్రస్తావన తెచ్చారే కానీ.. అప్పటి వరకూ ఆ ఊసే రాలేదు. చిన్నమ్మపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన పన్నీర్.. వేద నిలయాన్ని అమ్మ స్మారకంగా మార్చాలన్న డిమాండ్ ను తెరపైకి తీసుకురావటమే కాదు.. ఆ దిశగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని షురూ చేశారు.

అయితే.. చిన్నమ్మ అందులో ఉన్న నేపథ్యంలో.. ఆమెను బయటకు వెళ్లగొట్టి.. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా? అన్నది ప్రశ్నగా మారింది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో ఈ రోజు చిన్నమ్మ జైలుకు వెళ్లటం ఖాయమని తేలిపోయిన నేపథ్యంలో.. వేదనిలయం ఎవరి చేతుల్లోకి వెళుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పన్నీర్ వాదన వాస్తవ రూపం దాలిస్తే.. అది కాస్తా ప్రజల అకౌంట్లోకి వెళుతుందని చెప్పక తప్పదు. మొత్తంగా చూస్తే.. అమ్మ.. చిన్నమ్మలు మాత్రమే పరిచయం ఉన్న వేద నిలయానికి ఈ కొత్త పరిణామం మింగుడు పడటం కాస్త కష్టమే అవుతుందేమో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/