Begin typing your search above and press return to search.

నేను బాధ‌ప‌డుతుంటే.. మీరు ప‌ట్టించుకోవ‌ట్లేదు..: జ‌య‌ల‌లిత ఆడియో వైర‌ల్‌

By:  Tupaki Desk   |   20 Oct 2022 3:06 PM GMT
నేను బాధ‌ప‌డుతుంటే.. మీరు ప‌ట్టించుకోవ‌ట్లేదు..:  జ‌య‌ల‌లిత ఆడియో వైర‌ల్‌
X
త‌మిళ‌నాడు మాజీ సీఎం.. పురుచ్చిత‌లైవి.. అమ్మ‌.. జ‌య‌ల‌లిత మృతి కేసులో ట్విస్టుల‌పై ట్విస్టులు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఇది సాధార‌ణ మ‌ర‌ణ మేన‌ని.. ఆమెకు చికిత్స చేసిన అపోలో పేర్కొంటే.. ఆమె నెచ్చెలి.. శ‌శిక‌ళ కూడా.. అమ్మ‌ది సాధార‌ణ మ‌ర‌ణ‌మేన‌న్నారు. అయితే.. త‌ర్వాత‌.. త‌ర్వాత‌.. దీనిలో అనుమానాలున్నాయ‌ని.. అప్ప‌టి సీఎం ప‌ళ‌ని స్వామిపేర్కొన్నారు. త‌ర్వాత‌.. దీనిపై విచార‌ణ‌కు కూడా క‌మిష‌న్ వేశారు. అయితే.. ఇది ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. జ‌య మ‌ర‌ణంపై మాత్రం ఇప్పుడు మ‌రిన్ని అనుమానాలు బ‌ల‌ప‌డేలా.. ఒక ఆడియో వెలుగు చూసింది.

మరణానికి ముందు చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె మాట్లాడిన ఓ ఆడియో క్లిప్‌ వైరల్‌గా మారింది. దానిలో జ‌య స్వ‌రం స్ప‌ష్టంగా వినిపిస్తోంది. ఆమె ఏమ‌న్నారంటే.. `` నేను బాధ పడుతుంటే మీరు పట్టించుకోవడం లేదు`` అని అపోలో సిబ్బందిపై జయలలిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాదు.. ``నేను పిలిచినపుడు మీరెందుకు రాలేద``ని డాక్టర్లపై జయలలిత మండిపడ్డారు. చికిత్స సమయంలో ఆమె తీవ్రంగా దగ్గుతుండటం, డాక్టర్లపై చిరాకు పడుతున్నట్లు స్పష్టమవుతోంది. అయితే.. దీనికి స‌మాధానంగా ఎదుటి వ్య‌క్తి(డాక్ట‌ర్ కావొచ్చు) అప్లికేష‌న్ డౌన్‌లోడ్ చేస్తున్నాను.. అందుకే రాలేద‌ని స‌మాధానం ఇవ్వడం కూడా వినిపించింది.

అయితే.. ఈ ఆడియోను అప్ప‌టి ఆస్పత్రి సిబ్బందిలోని ఓ వ్యక్తి రికార్డ్ చేశారు. జయలలిత మరణంపై దర్యాప్తు చేసిన జస్టిస్‌ ఆర్ముగస్వామి నివేదిక జ‌య‌ల‌లిత మ‌ర‌ణంపై అనుమానాలు వ్య‌క్తం చేయ‌డం.. శ‌శిక‌ళ‌ను విచారించాలని సూచించ‌డం.. అంతేకాదు.. జ‌య ల‌లిత‌కు స‌రైన వైద్యం అంద‌లేద‌ని.. కొన్ని కొన్ని ఉద్దేశ‌పూర్వ‌కంగా.. ప‌క్క‌కు త‌ప్పించార‌ని.. ఆయ‌న పేర్కొన్న ద‌రిమిలా.. త‌న‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌న్న వ్యాఖ్య‌ల‌తో కూడిన జ‌ల‌లిత ఆడియో బయటకు రావ‌డం ఇప్పుడు మ‌రింత సంచ‌ల‌నంగా మారింది.

అదే విధంగా 2017లో చెన్నైలో తన ప్రెస్ మీట్ అనంతరం డాక్టర్ రిచర్డ్ బిల్ మాట్లాడిన వీడియో కూడా వైరల్‌గా మారింది. జయలలిత వైద్యం కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉందా? అని శశికళ ప్రశ్నించగా.. ఆమె తప్పక వెళ్లాలని డాక్టర్ చెప్పడంతో వారు అంగీకరించారు. కానీ ఆ తర్వాత జయలలితే స్వయంగా చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడలేదని డాక్టర్‌ రిచర్డ్‌ బిల్‌ పేర్కొన్నారు.

ఇది శ‌శిప‌నేనా?

అయితే.. తాజాగా ఆర్ముగ స్వామి నివేదిక త‌న‌వైపు వేలెత్తి చూపిస్తున్న స‌మ‌యంలో శ‌శిక‌ళే ఆ ఆడియో క్లిప్‌ల‌ను ఉద్దేశ‌పూర్వకంగా బ‌య‌ట‌కు తెస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. త‌న త‌ప్పుపై స్వామి నివేదిక‌.. స్ప‌ష్టం చేస్తున్న ద‌రిమిలా.. త‌న‌ను తాను కాపాడుకునే క్ర‌మంలో ఆసుప‌త్రి యాజ‌మాన్యం నిర్ల‌క్ష్యం.. అదేస‌మ‌యంలో అమ్మ వైద్యానికి స‌హ‌క‌రించ‌లేద‌నే కోణంలో.. ఈ ఆడియోలు ఉండ‌డాన్ని బ‌ట్టి.. దీని వెనుక శ‌శి ఉంద‌నే బ‌ల‌మైన ఆరోప‌ణ‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.