Begin typing your search above and press return to search.

జయలలితకు తీరని కోరిక

By:  Tupaki Desk   |   7 Dec 2016 4:41 PM GMT
జయలలితకు తీరని కోరిక
X
తమిళుల ఆరాధ్య దైవం జయలలిత జీవితంలో అనుకున్నవన్నీ సాధించారు. అయితే ప్రధాని కావాలన్న ఒకే ఒక్క కోరిక మాత్రం తీరకుండానే ఆమె మరణించారు. రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని నిలదొక్కుకున్న ఆమె ఎప్పటికైనా ప్రధాని అవుతానని అనుకునేవారట. అంతేకాదు.. దక్షిణాది నుంచి ప్రధానయ్యే అవకాశం తనకు మాత్రమే ఉందని ఆమె భావించేవారట. వాజ్‌పేయి తొలిసారి ప్రధాని అయిన సమయంలో ఆయన ప్రభుత్వానికి జయ బయటనుంచి మద్దతిచ్చారు. అప్పుడే ఆమెలో ప్రధాని పదవి పట్ల ఆసక్తి పెరిగింది. 2014ఎన్నికల్లో ఆమె పార్టీ 39స్థానాలకుగాను ఏకంగా 37ఎమ్‌పి సీట్లుకైవసం చేసుకుంది. ఇది ఆమెలో ఆసక్తిని మరింతగా పెంచింది. అయితే ఈ ఎన్నికల్లో మోడి నేతృత్వంలోని బిజెపికి ప్రభుత్వ ఏర్పాటుకవసరమైనన్ని సీట్లు సొంతంగానే దక్కాయి. పైగా అంతకుముందే కొన్ని పార్టీల్తో కూడిన ఎన్‌ డి ఎకు బిజెపి నాయకత్వం వహించింది. దీంతో జయకు భారీగా ఎమ్‌ పి సీట్లున్నా వాటి అవసరం కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం కాలేదు.

కానీ 2019ఎన్నికలపై ఆమె దృష్టిపెట్టారు. ప్రధాని కాకముందు మోడితో ఆమెకు మంచి సంబంధాలుండేవి. గుజరాత్‌ - తమిళనాడు ముఖ్య మంత్రులుగా పలు సందర్భాల్లో వారిద్దరూ చర్చలు జరిపారు. మోడీ ప్రధాని అయ్యాక ఇద్దరి మధ్య దూరం పెరిగింది. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ పరిస్థితి హీనంగా మారడంతో ఉత్తరాదిన కాంగ్రెస్‌ అవసరం తనకుంటుందని జయలలిత అంచనాలేశారు. ఆ పార్టీ నేతల్తో సమయస్ఫూర్తిగా వ్యవహరించడం మొదలెట్టారు.

మరోవైపు బిజెపి - కాంగ్రెస్సేతర పార్టీల్తో మూడోకూటమి కట్టే అవకాశాలు తనకు మాత్రమే ఉన్నాయని ఆమె భావించేవారు. వామపక్షాల్తో పాటు యునైటెడ్‌ జనతాదళ్‌ - సెక్యులర్‌ జనతాదళ్‌ - సమాజ్‌ వాది పార్టీ - బిఎస్‌ పి - తృణమూల్‌ తదితర పార్టీల్తో కూటమి కడితే కనీసం 150నుంచి 170సీట్లు వచ్చే ఎన్నికల్లో సాధించే అవకాశాలుంటాయని ఆమె భావించేవారు. అప్పటికి మోడి ప్రాభవం తగ్గుతుంది.అలాగని కాంగ్రెస్‌ కు పెద్దగా ఎదుగుదలుండదు. దీంతో తృతియ కూటమే ప్రత్యామ్నాయంగా మారుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ నేతలు బిజెపిని స్వయంగా నిలువరించే శక్తిలేక మూటోకూటమికి మద్దతిచ్చే అవకాశాలుంటాయని అంచనా వేసేవారని చెబుతుంటారు. అయితే.. మృత్యువు ఆమె కలలను ఛిద్రం చేసింది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/