Begin typing your search above and press return to search.

అమ్మ సంతకం చేసే పరిస్థితుల్లో కూడా లేరంట

By:  Tupaki Desk   |   3 Nov 2016 6:04 AM GMT
అమ్మ సంతకం చేసే పరిస్థితుల్లో కూడా లేరంట
X
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు మహా గుట్టుగా సాగుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబరు 22న హుటాహుటిన చెన్నై అపోలోకు తరలించిన తర్వాత ఆమె ఆరోగ్యం ఎలా ఉందన్నది.. అధికారికంగా విడుదల చేసే అరకొర సమాచారంతో మాత్రమే బయటకు వెల్లడయ్యే పరిస్థితి. అంచనాలు.. ఊహాగానాలు వెల్లడైనా.. వాటిల్లో నిజం పాళ్లు ఎంతన్నది ఎవరూ చెప్పలేనిది. ఆసుపత్రి పాలైన అమ్మను పరామర్శించేందుకు కేంద్రమంత్రుల స్థాయి నుంచి పార్టీ అధినేతల వరకూ క్యూ కట్టినా.. అమ్మను చూసే అవకాశం ఎవరికీ దక్కలేదు.

పరామర్శకు వెళ్లిన వారంతా అమ్మకు వైద్యం చేస్తున్న వైద్యులతో మాట్లాడి వెనక్కి తిరిగి రావటమే తప్పించి.. ఆమె దగ్గరకు వెళ్లిన వారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరనే చెప్పాలి. వారాల తరబడి ఆసుపత్రిలో ఉన్న అమ్మకు ఎలా ఉందన్న టెన్షన్ ఒకవైపు.. మరోవైపు ఉప ఎన్నికల పక్రియ ఇప్పుడా రాష్ట్రంలో మొదలైంది. మూడు నియోజకవర్గాలకు ఈ నెల 19న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థులకు బీఫారం ఇవ్వాల్సిన పరిస్థితి. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలో ఉన్న అమ్మ.. బీఫారం మీద సంతకం చెయాల్సిందే. ఈ నేపథ్యంలో సంతకం కాకుండా అమ్మ వేలిముద్రతో బీఫారం బయటకు రావటంపై భారీ చర్చ సాగుతోంది? అమ్మ సంతకం కూడా చేయలేని స్థితిలో ఉన్నారన్న వ్యవహారంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీ నేత రామచంద్రన్ స్పందించారు. అమ్మకు ప్రస్తుతం ఫిజియోథెరపి చికిత్స చేస్తున్నారని.. ఆమె సంతకాలు చేయలేకపోతున్నారన్నారు. ఈ కారణం చేతనే బీఫారం మీద అమ్మ సంతకం చేయకుండా వేలిముద్ర వేసినట్లుగా వెల్లడించారు. ఆయన మాటలు నిజమని నమ్మితే.. మరి పార్టీ వర్గాల వారు ప్రకటించినట్లుగా అమ్మ తనకు తానే ఆహారం తీసుకుంటున్నారని కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. అంతేకాదు.. అంతకుముందే ఆమె పేపర్ చదువుతున్నట్లుగా ప్రచారం జరిగింది.

ఓపక్క కీలకమైన బీఫారంల మీద సంతకాలు పెట్టానికి ఇబ్బందిగా ఉన్నఅమ్మ.. తనకు తానే ఆహారం తీసుకోవటం.. పేపర్ ను కూడా చదువుతున్నట్లుగా చెబుతున్నప్పుడు.. సంతకం మాత్రం ఎందుకు చేయటం లేదన్నది ప్రశ్న. తాజాగా అన్నాడీఎంకే నేత చెప్పిన మాటల ప్రకారం సంతకం కూడా పెట్టలేని పరిస్థితుల్లో అమ్మ ఉన్నట్లు స్పష్టమవుతుంది. అదే నిజమైతే.. అమ్మ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావటానికి మరింత కాలం పట్టటం ఖాయమన్నట్లుగా లేదు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/