Begin typing your search above and press return to search.

అమ్మ వేద నిల‌యం అంద‌రిది కానుందా?

By:  Tupaki Desk   |   18 Aug 2017 5:00 AM GMT
అమ్మ వేద నిల‌యం అంద‌రిది కానుందా?
X
త‌మిళుల గుండెల్లో ఉంటుంద‌ని చెప్పే అమ్మ ముచ్చ‌ట ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. అంద‌రి గుండెల్లో ఉండే అమ్మ‌.. త‌న గుండెల్లో ప్ర‌త్యేక స్థానం ఉన్న వేద‌నిల‌యంలోకి మాత్రం ఎవ‌రినీ రానివ్వ‌దు. తాను క‌ష్ట‌ప‌డి సంపాదించిన సొమ్ముతో ఎంతో ఇష్టంగా క‌ట్టుకున్న వేద‌నిల‌యంలోకి ఎంట్రీ చాలా కొద్దిమందికే. ద‌శాబ్దాలుగా మిస్ట‌రీగా ఉన్న‌ వేద నిల‌యం గుట్టు ఇప్పుడంద‌రికి తెలీయ‌నుంది.

పోయెస్ గార్డెన్ లోని వేద‌నిల‌యాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాల‌ని.. జ‌య‌ల‌లిత స్మార‌క భ‌వ‌నంగా మార్చాలంటూ ప‌ళ‌ని స‌ర్కారు నిర్ణ‌యించింది. దీంతో.. ఇప్ప‌టివ‌ర‌కూ క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకునే వేద‌నిల‌యాన్ని క‌ళ్లారా చూసే అవ‌కాశం మ‌రికొద్ది రోజుల్లో సామాన్యుల‌కు ద‌క్క‌నుంది.

1967లో కొనుగోలు చేసిన ఈ భ‌వ‌నంలోకి ఇప్ప‌టివ‌ర‌కూ అతి కొద్ది మందికి మాత్ర‌మే ఎంట్రీ ల‌భించింది. భ‌వ‌నం మొత్తం గురించి తెలిసిన వారు వేళ్ల మీద లెక్కించేంత మంది మాత్ర‌మే ఉంటార‌ని చెబుతున్నారు. సినీన‌టిగా తాను సంపాదించిన సొమ్ముతో 1967లో రూ.1.32 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేసిన భ‌వ‌నాన్ని త‌న త‌ల్లి అస‌లు పేరు క‌లిసి వ‌చ్చేలా వేద నిల‌యం అని పెట్టుకున్నారు. దాదాపు 20 వేల చ‌ద‌ర‌పు అడుగుల వైశాల్యంలో ఉండే ఈ వేద నిల‌యంలో ఇర‌వై మందికి పైగా ప‌నివాళ్లు ఉండేవారు.

అత్యాధునిక వ‌స‌తుల‌తో పాటు.. హంగులున్న ఈ ఇంట్లో సాంకేతికంగా కూడా చాలానే స‌దుపాయాలు ఉన్నాయ‌ని చెబుతారు. ఎవ‌రితోనైనా వీడియో కాన్ఫ‌రెన్స్ లో మాట్లాడ‌గ‌లిగే స‌దుపాయాలు.. ఐసీయూను త‌ల‌పించేలా వైద్య స‌దుపాయాలు ఉన్న పెద్ద గ‌ది.. మినీ సినిమా థియేట‌ర్ ఉన్న‌ట్లు చెబుతారు. జ‌య వెంట ఆమె నెచ్చెలి శ‌శిక‌ళ‌.. ఆమె మ‌ర‌ద‌లు ఇళ‌వ‌ర‌సి.. 20 ఏళ్ల వ‌య‌సున్న ఇద్ద‌రు యువ‌తులు మాత్ర‌మే ఉండేవార‌ని చెబుతారు. అప్పుడ‌ప్పుడు జ‌య మేన‌ల్లుడు దీప‌క్ వ‌చ్చేవార‌ని చెబుతారు. ఇక‌.. జ‌య ఇంట్లో ఉన్న 20 ఏళ్ల ఇద్ద‌రు అమ్మాయిలు దేశంలోని వేర్వేరు ప్రాంతాల‌కు చెందిన వార‌న్న మాట వినిపిస్తుంటుంది. అదేమీ కాదు.. వారిద్ద‌రిని న‌రేంద్ర మోడీయే గుజ‌రాత్ నుంచి పంపించార‌న్న మాట‌ను చెబుతుంటారు. వారిద్ద‌రూ అమ్మ‌కు అవ‌స‌ర‌మైన మందులు మొద‌లు మేక‌ప్ ట‌చ‌ప్ ల వ‌ర‌కూ అన్నీ చూసుకునే వార‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది. అయితే.. ఇప్ప‌టికి ఆ ఇద్ద‌రు యువ‌తులు ఎవ‌రు? ఎక్క‌డి నుంచి వ‌చ్చారు? అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత వారిద్ద‌రూ ఏమయ్యారు? అన్న‌ది మిస్ట‌రీనే.

అమ్మ త‌ర్వాత వేద‌నిల‌యంలో శ‌శిక‌ళ‌.. ఆమె కుటుంబీకులు.. జ‌య మేన‌ల్లుడు దీప‌క్ ఉండేవారు. శ‌శిక‌ళ జైలుకు వెళ్లిన త‌ర్వాత మాత్రం వేద‌నిల‌యానికి దీప‌క్ అప్పుడ‌ప్పుడు వ‌చ్చి వెళుతుండేవారు. ఇప్పుడు ఆ ఇంట్లో ప‌ని వాళ్లు త‌ప్పించి మ‌రెవ‌రూ లేరు. అయితే.. వేద‌నిల‌యం త‌మ అత్త ఆస్తి అని.. అది త‌మ‌కే చెందుతుంద‌ని అమ్మ మేన‌కోడ‌లు దీప వాదిస్తున్నారు. కోర్టుకు వెళ్ల‌నున్న‌ట్లు ఆమె చెబుతున్నారు. ఇక‌.. దీప‌క్ సైతం వేద నిల‌యం కోసం త‌న సోద‌రితో ఘ‌ర్ష‌ణ ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే.. వేద నిల‌యాన్ని స్మార‌కంగా మార్చాల‌న్న ప‌ళ‌నిస్వామి ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న వెంట‌నే.. ఆ ఇంటికి భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. మ‌రి.. ద‌శాబ్దాల కాలంగా గుట్టుగా ఉన్న వేద‌నిల‌యం ఇప్ప‌డు అంద‌రికి అందుబాటులోకి రానుందా? అన్న అంశంపై స‌స్పెన్స్ మ‌రికొంత‌కాలం కొన‌సాగుతుంద‌ని చెప్పొచ్చు.