Begin typing your search above and press return to search.

అమ్మ రాజకీయ జీవితానికి అదే నిచ్చెన

By:  Tupaki Desk   |   7 Dec 2016 7:49 AM GMT
అమ్మ రాజకీయ జీవితానికి అదే నిచ్చెన
X
తమిళనాటే కాకుండా యావద్భారతదేశాన్ని షాక్ కు గురిచేస్తూ ఈ లోకాన్ని వీడి వెళ్లిన జయలలిత తన రాజకీయ జీవితంలో పులిలా బతికారన్న సంగతి చిన్నపిల్లలను అడిగినా చెబుతారు. అలాంటి ఆడపులి రాజకీయ జీవితం రూపుదిద్దుకోవడానికి బలమైన కారణమే ఉంది. విపక్షాలు చేసిన దుస్సాహసం ఆమెలోని పట్టుదలను పెంచి... రాటుదేలేలా చేశాయి. ఆ ఘటన గురించి ఆమే స్వయంగా గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

1999 నాటి ఆ ఇంటర్వ్యూలో ఆమె గతాన్ని తలచుకున్నారు. 1989లో తమిళనాడు శాసనసభలో డీఎంకే సభ్యులు జయను ఘోరంగా అవమానించారు. ఆ ఘటన గురించే ఆమె తన ఇంటర్వ్యూలో చెప్పారు. 1989 మార్చి 25న ఆ ఘటన జరిగింది.. అప్పటికి కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు శాసనసభలో కరుణానిధి ఉండగానే... ఆయన పార్టీకి చెందిన సభ్యులు జయపై దాడికి దిగారు. ఏదో అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న జయపైకి వచ్చి ఆమె చీర లాగారు. దీంతో చినిగిన చీరతోనే ఆమె శాసనసభ నుంచి బయటకు వెళ్తూ శపథం చేశారు. ముఖ్యమంత్రిగానే తాను మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడతానని.. అప్పటివరకు రానని ప్రకటించారు. అదే ఆమె రాజకీయ జీవితానికి పెద్ద మలుపని చెబుతారు.

చినిగిన చీరతో కన్నీళ్లు పెడుతున్న జయ చిత్రాలు అన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రముఖంగా ప్రసారమయ్యాయి. తిరుగులేని సానుభూతి ఆమెకు వచ్చింది. ముఖ్యంగా మహిళలు జయలలిత బాధను తమ బాధగా భావించారు. అక్కడి నుంచి జయకు తిరుగులేదు... ఆమె ముఖ్యమంత్రి అయి మళ్లీ సభలోకి అడుగుపెట్టి శపథాన్ని నిజం చేశారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/