Begin typing your search above and press return to search.

కోర్టు తీర్పుతో మ‌ళ్లీ సీఎం కానున్న సెల్వం

By:  Tupaki Desk   |   6 Feb 2017 12:54 PM GMT
కోర్టు తీర్పుతో మ‌ళ్లీ సీఎం కానున్న సెల్వం
X
అక్ర‌మాస్తుల కేసులో కోర్టు తీర్పు ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - తమిళ‌నాడు కాబోయే ముఖ్య‌మంత్రి శ‌శిక‌ళ‌కు వెంట‌నే ప‌ద‌వీ గండం ఉండేలాగా క‌నిపిస్తోంది. డీఎంకే అధ్యక్షుడు - ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌ స్టాలిన్ వ్యాఖ్య‌లు ఇందుకు బ‌లం చేకూరుస్తున్నాయి. మీడియాతో స్టాలిన్‌ మాట్లాడుతూ.. జయలలిత ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పన్నీర్‌సెల్వం నాలుగోసారి సీఎం అవుతారన్నారు. వ‌చ్చే వారంలో జ‌య ఆస్తుల కేసు తీర్పు ఉంద‌ని, ఇందులో ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రి ప‌గ్గాలు చేప‌ట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్న శ‌శిక‌ళ పాత్ర కూడా ఉన్నందున ఆమె దోషిగా నిరూపితం అయి పన్నీర్‌సెల్వం నాలుగోసారి సీఎం అవుతారని స్టాలిన్ జోస్యం తెలిపారు.

మాజీ కేంద్ర మంత్రి - కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్ష నేత మల్లికార్జున ఖర్గే సైతం చిన్న‌మ‌మ్మ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డంపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం సరైనది కాదని ఆయ‌న అభిప్రాయపడ్డారు. శశికళా నటరాజన్‌ కు వారి పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేదని, ఇటువంటి వ్యక్తులు అధికారంలోకి రావడం ప్రజాస్వామ్యంలో మంచి సంప్రదాయం కాదని ఆయన అన్నారు. డీఎండీకె నేత ఎళంగోవన్ మీడియాతో మాట్లాడుతూ శశికళా నటరాజన్‌ ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడమనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని, అందులో తాము జోక్యం చేసుకోలేమని అన్నారు. ఎఐఎడిఎంకె 2011లో అధికారంలోకి వచ్చినప్పడే రాష్ట్ర భవిష్యత్తు దెబ్బ తిన్నదని ఆయన చెప్పారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఏ పార్టీ వ్యవహరించజాలదని, శశికళను సిఎంగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారని, దానిని ప్రజలు ఆమోదిస్తారా లేదా చూడాల్సి ఉందని ఆయన చెప్పారు.

ఇదిలాఉండ‌గా...త‌మిళ‌నాడులో మారుతున్న రాజ‌కీయాల‌పై ఫిల్మ్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌ - క్రికెట‌ర్ అశ్విన్ స్పందించారు. హీరో క‌మ‌ల్ త‌మిళంలో త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌ లో తాజాగా ఓ పోస్ట్ చేశారు. మూడ‌వ శ‌తాబ్ధానికి చెందిన తిరువ‌ల్లూరు కామెంట్‌ను ఆయ‌న పోస్ట్ చేశారు. నెమ‌లి ఈక‌లు బండి చ‌క్రాల‌ను ధ్వంసం చేయ‌గ‌ల‌వ‌న్న ఉద్దేశం ఆ ట్వీట్‌లో ఉన్న‌ట్లు బాషా నిపుణులు అంటున్నారు. ప్ర‌స్తుతం త‌మిళ రాష్ట్ర రాజ‌కీయాల‌కు ఇది ఎలా వ‌ర్తిస్తుదంటే, అధికారం విష‌యంలో సాధార‌ణ ప్ర‌జ‌ల స‌హ‌నాన్ని ప‌రీక్షించ‌రాద‌న్న ఉద్దేశం వ‌స్తుంద‌ని అంటున్నారు. క్రికెట‌ర్ అశ్విన్ కూడా రాష్ట్ర రాజ‌కీయాల‌పై కామెంట్ చేశారు. త‌మిళ‌నాడులో మొత్తం 234 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. దీన్ని ఉద్దేశంగా భావిస్తూ ఆ క్రికెట‌ర్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్లో ఓ గూగ్లీ వేశాడు. రాష్ట్రంలో త్వ‌రంలో యువ‌త‌కు 234 కొత్త ఉద్యోగాలు రానున్న‌ట్లు అశ్విన్ ట్వీట్ చేశాడు. ఈ కామెంట్‌పై డీఎంకే నేత ఒక‌రు స్పందించారు. రాజ‌కీయాల‌పై యువ‌కులు స్పందించ‌డం మంచిదేద‌న్నారు. ఈ నేపథ్యంలో అశ్విన్ మళ్లీ తన ట్వీట్ పై స్పందించారు. తాను రాజకీయ ఉద్దేశంతో ట్వీట్ చేయలేదన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/