Begin typing your search above and press return to search.

అమ్మ ఆస్తుల వేలానికి స‌ర్వం సిద్ధ‌మైంది

By:  Tupaki Desk   |   23 March 2017 9:43 AM GMT
అమ్మ ఆస్తుల వేలానికి స‌ర్వం సిద్ధ‌మైంది
X
త‌మిళ‌నాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల‌ను వేలం వేసేందుకు రంగం సిద్ధ‌మైంది. అక్రమాస్తుల కేసులో రూ.100 కోట్ల అపరాధ సొమ్మును వసూలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ కేసులో నిందితురాలైన జ‌య‌ల‌లిత‌ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె శిక్షను రద్దు చేసున్నట్లు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. అయితే స‌మ‌యంలో సుప్రీంకోర్టు అపరాధ రుసుం రూ.100 కోట్లను వేరే రూపంలో వసూలు చేయాలని ఉత్తర్వులిచ్చింది. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో కోర్టు ఆదేశాల మేరకు జయలలిత-శశికళ-ఇళవరసి-దివాకరన్‌ నుంచి తమిళనాడు ప్రభుత్వం రూ. 130 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. అయితే జయలలిత మరణించడంతో ఆమెకు చెందిన ఆస్తులను వేలం వేసి రూ. 100 కోట్ల అపరాధ రుసుం వసూలు చేయాలి. అలాగే అమ్మ స‌న్నిహితురాలైన‌ శశికళ, - ఆమె బంధువులైన‌ ఇళవరసి - దివాకరన్ ల నుంచి రూ.30 కోట్ల అపరాధ రుసుం వసూలు చేయాలి. ఈ నేప‌థ్యంలో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం త‌గు ఏర్పాట్లు చేస్తోంది.

ఇదిలావుండగా ఈ తీర్పును పున:సమీక్షించాలని కోరుతూ కర్ణాటక ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ముద్దాయి చనిపోయిన నేపథ్యంలో జయలలితకు విధించిన అపరాధ రుసుం వసూలు చేసేందుకు రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదనేది ఈ పిటిషన్‌ సారాంశం. ఈ పిటిషన్‌ త్వరలో సుప్రీంకోర్టు విచారణకు రానుంది. తాజా తీర్పుపై అన్నాడీఎంకే ప్ర‌త్యర్థి అయిన డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బలగన్ తరఫు న్యాయవాదులు బాలాజీ సింగ్, తామరై సెల్వన్‌ మాట్లాడుతూ బెంగుళూరు ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఖరారు చేసిందని వెల్ల‌డించారు. జయలలిత మృతి చెందినప్ప‌టికీ ఆమెకు విధించిన రూ.100 కోట్ల అపరాధ సొమ్మును చెల్లించాల్సి ఉందని వివ‌రించారు. జయలలిత ఆస్తులను వేలం వేసి అపరాధ సొమ్మును వసూలు చేయవచ్చని న్యాయమూర్తి కున్హా కూడా తీర్పులో చెప్పిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. త్వరలో ఆస్తులను వేలం వేయాలనే ఉద్దేశంతో పిటిషన్‌ కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా కర్ణాటక ప్రభుత్వానికి కేసు ఖర్చు నిమిత్తం రూ.12 కోట్ల 50 లక్షలు తమిళనాడు ప్రభుత్వం త్వరలో ఇవ్వనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/