Begin typing your search above and press return to search.

ఇన్నాళ్లకు అమ్మ ప్రాబ్లం ఒకటి బయటపెట్టారే!

By:  Tupaki Desk   |   9 Oct 2016 10:03 AM GMT
ఇన్నాళ్లకు అమ్మ ప్రాబ్లం ఒకటి బయటపెట్టారే!
X
అకస్మాత్తుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అర్థరాత్రి వేళ.. హుటాహుటిన ఆసుపత్రికి చేర్పిస్తే ఎంత గందరగోళం చోటు చేసుకుంటుంది? అందులోకి సదరు ముఖ్యమంత్రికి మాస్ ఇమేజ్ ఉంటే.. ప్రజలు ఎంత కంగారు పడతారు? ఎంత ఆందోళన చెందుతారు? ఎంత భావోద్వేగానికి గురి అవుతారు? లాంటి ప్రశ్నలకు సమాధానంగా తమిళనాడు రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

దాదాపు 18 రోజులుగా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో ఉన్నారు. అమ్మగా సుపరిచితురాలైన ఆమెకు ఉన్న అసలు సమస్య ఏమిటన్నది ఇప్పటివరకూ అధికారికంగా బయటపెట్టింది లేదు.ఎప్పటికప్పుడు అమ్మ ఆరోగ్యం కుదుట పడిందనో.. ఆమెకు మెరుగైన చికిత్సను అందిస్తున్నామనో.. అమ్మ శరీరం చికిత్సకు సహకరిస్తుందని.. ఆమె కోలుకుంటున్నారు.. తరహాలో మాత్రమే హెల్త్ బులిటెన్లు ఇస్తున్న అపోలో ఆసుపత్రి అందుకు భిన్నంగా తొలిసారి.. అమ్మకు జరుగుతున్న చికిత్సకు సంబంధించిన ఒక అంశాన్ని బయటపెట్టిందని చెప్పాలి.

ఇప్పటిదాకా అమ్మకున్న అనారోగ్యం గురించి వైద్యులు అధికారికంగా చెప్పింది రెండు అంశాలు మాత్రమే. అందులో ఒకటి.. విపరీతమైన జ్వరం.. డీ హైడ్రేషన్ అని మాత్రమే ప్రకటించారు. అందుకు మించి.. ఆమెకున్న సమస్యల గురించి బయటపెట్టింది లేదు. అయితే.. జయలలితకు మల్టీ ఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లుగా పలువురు చెబుతున్నా.. అధికారికంగా అలాంటి సమాచారం బయటకు రాలేదు. అయితే.. ఇందుకు భిన్నంగా అపోలో ఆసుపత్రి విడుదల చేసిన ఒక బులిటెన్లో ఆమెకున్న ప్రాబ్లంను ప్రస్తావించారు.

ఉపిరితిత్తుల్లో శ్లేష్మ పొరను తొలగించి.. మందులు వాడుతున్నామని.. మరింత జాగ్రత్తగా ఆమెను పర్యవేక్షిస్తున్నట్లుగా చెప్పారు. అంటే.. ఊపిరితిత్తులకు సంబంధించిన ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించారన్న మాట. ఇక.. ఆమెకున్న సమస్యను మరింత వివరంగా చెప్పుకుంటే.. ఊపిరితిత్తుల సమస్యతో చలనం లేని వారికి జరిపే ఫిజియోథెరపీ నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. అంటే.. అమ్మ ఊపిరితిత్తులకు సంబంధించి తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్న విషయం అపోలో ఆసుపత్రి అధికారికంగా విడుదల చేసిన రిపోర్ట్ స్పష్టం చేసినట్లుగా చెప్పొచ్చు. ఇన్నాళ్లకు ఊపిరితిత్తుల సమస్యను బయటపెట్టిన అపోలో ఆసుపత్రి.. రానున్న రోజుల్లో ఇంకెన్ని సమస్యల్ని తెరపైకి తీసుకొస్తారో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/