Begin typing your search above and press return to search.

అమ్మ అంత్యక్రియల్లో కనిపించిన అతను మాట్లాడాడు

By:  Tupaki Desk   |   21 Dec 2016 8:46 AM GMT
అమ్మ అంత్యక్రియల్లో కనిపించిన అతను మాట్లాడాడు
X
అమ్మ అంత్యక్రియల సమయంలో నెచ్చెలి శశికళతో పాటు ఒక బొద్దు కుర్రాడు ప్రముఖంగా కనిపించాడు. శశికళ వెంట ఉన్న ఆ కుర్రాడు.. అమ్మకు అంతిమ సంస్కారాల్ని శశికళతో కలిసి నిర్వహించారు. అప్పటికప్పుడు తెర మీద ప్రముఖంగా కనిపించిన ఆ కుర్రాడు ఎవరు? అతను అమ్మకు ఏమవుతారు? అన్న ప్రశ్నలు వచ్చినా దానికి సమాధానం మాత్రం ఆలస్యంగానే దొరికాయి. అతను ఎవరో కాదని.. జయలలిత సోదరుడు జయరామన్ కుమారుడు దీపక్ గా తేలింది. తన అత్త దగ్గరకు తనను రానివ్వటం లేదంటూ మీడియా ముందు రచ్చ చేసిన దీప సోదరుడిగా తేల్చారు. తాజాగా అతడో తమిళ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా అమ్మకు సంబంధించిన ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చాడు.

= నేనెప్పుడూ కనిపించలేదన్నట్లుగా మాట్లాడుతున్నారు. నేనెక్కడా దాకోలేదు. పోయెస్ గార్డెన్ కు తరచూ వెళ్లి వస్తుండేవాడిని. జయలలిత అత్తను అపోలో వైద్యం చేసిన 75 రోజుల్లో ఐదు మినహా మిగిలిన 70 రోజులూ ఆమె వెంటే ఉన్నా. మా కుటుంబానికి అత్త కుటుంబానికి గ్యాప్ లేదు. గొడవల్లేని ఇళ్లు అంటూ ఉంటాయా చెప్పండి. చిన్న చిన్న తగాదాలున్నా.. వెంటనే సమిసిపోయేవి. అత్త ఎప్పుడూ పిలిచినా పోయెస్ గార్డెన్ కు వెళ్లి వచ్చేవాడ్ని. కానీ.. అత్త రాజకీయాల్లో మాత్రం తలదూర్చలేదు.

= అత్త అనారోగ్యానికి ముందు పోయెస్ గార్డెన్ కు నాలుగు నెలల కిందట చివరిసారి వెళ్లాను. పూజ చేసినప్పుడు సంకల్పం చేయటానికి నన్ను మాత్రమే అత్త పిలిచారు. మధ్యాహ్నం అక్కడే భోజనం చేసి రాత్రికి ఇంటికి తిరిగి వెళ్లాను. పోయెస్ గార్డెన్ లో అత్త విధించే క్రమశిక్షణ.. కట్టుబాట్ల మధ్య ఒక రోబోలా ఉండటం కష్టమనిపించేది.

= దీప తనకు తాను అగాధం సృష్టించుకుంది. నేను వీలు చిక్కినప్పుడల్లా అత్తతో మాట్లాడుతుండేవాడిని. దీప ఎప్పుడూ అలా చేయలేదు. దీంతో దూరం పెరిగింది. అత్తకు అపోలో ఆసుపత్రిలో చికిత్స చేసింది ఒక్క డాక్టర్ మాత్రమే కాదు. లండన్ డాక్టర్.. ఎయిమ్స్ వైద్య నిపుణులంతా కలిసి ఒక బృందంగా ఏర్పడి చికిత్స చేశారు.

= రాజకీయాల్లోకి రావాలని లేదు. శశికళ అత్తకు మద్దతు ఇస్తే.. ఆమెకు నేను అమ్ముడుబోయినట్లుగా మీరే వార్తలు రాస్తారు. సోదరి దీప రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అన్నది ఆమె వ్యక్తిగత అంశం. సోదరుడిగా మాత్రం రాజకీయాల్లోకి రాకూడదనే సలహా ఇస్తా. సోదరి దీపనే కాదు.. నన్ను కూడా అపోలో ఆసుపత్రిలో అత్తను చేర్చిన రోజు అడ్డుకున్నారు.

= అత్త ఆస్తులు ఎవరికి చేరాలో వారికి సక్రమంగా చేరతాయి. చెడ్డవారి చేతుల్లోకి వెళితే మాత్రం అడ్డుకుంటాను. అత్తకు శశికళ అత్తపై ఉన్న విశ్వాసం ఎలాంటిదో పార్టీలో అందరికి తెలుసు. అత్తతో శశికళ అత్త చివరి వరకూ వెంటే ఉన్నారు. మధ్యలో నాలుగు నెలల మాత్రమే శశి అత్తను దూరంగా ఉంచారు. 34 ఏళ్ల పాటు శశి అత్తే విశ్వాసపాత్రురాలిగా ఉన్నారు. విషప్రయోగంతో జయఅత్తను చంపారన్న వార్తల్ని నేను నమ్మను.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/