Begin typing your search above and press return to search.

ఆ ఎమ్మెల్యే ఇంట 'జయమ్మ పంచాయితీ' మూవీ గుర్తుకు తెచ్చే సీన్

By:  Tupaki Desk   |   25 Aug 2022 4:30 PM GMT
ఆ ఎమ్మెల్యే ఇంట జయమ్మ పంచాయితీ మూవీ గుర్తుకు తెచ్చే సీన్
X
ఈ మధ్యన విడుదలైన 'జయమ్మ పంచాయితీ' సినిమా గుర్తుందా? ప్రముఖ యాంకర్ సుమ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీని చూస్తే.. ఇలాంటి సంప్రదాయం అంటూ ఒకటి ఉందా? అన్న సందేహం కలగక మానదు. ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు ఫంక్షన్ నిర్వహించటం.. అందులో భాగంగా వచ్చే చదవింపులతో ఆర్థికంగా ఎదురయ్యే ఇబ్బందుల్ని అధిగమించేలా ఉండటం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

సినిమాలో జయమ్మకు ఎదురైన కష్టం అయ్యో అనిపిస్తూనే.. ఆమె చేసే పోరాటం సినిమా చూస్తున్నంత సేపు కట్టిపడేసేలా చేస్తుంది. అయితే.. తమిళనాడులో తాజాగా చోటు చేసుకున్న ఒక ఉదంతాన్ని చూస్తే.. జయమ్మ పంచాయితీలోని సంప్రదాయం సినిమా వరకే కాదు.. రియల్ గా కూడా ఉందన్న విషయం అర్థం కాక మానదు.

రీల్ కు కాస్త భిన్నంగా చోటు చోటు చేసుకున్న ఈ వ్యవహారంలోకి వెళితే.. తమిళనాడు అధికార పార్టీ డీఎంకేకు చెందిన ఎమ్మెల్యే ఒకరు తమ ఇంట జరిగే ఒక వేడుకలో భాగంగా చదివింపుల విందును కూడా ఏర్పాటు చేయటం ఒక ఎత్తు అయితే.. చదివింపులకు ఏకంగా రూ.10 కోట్లు రావటం షాకింగ్ గా మారింది. తంజావూర్.. పుదుకొట్టై తదితర జిల్లాల్లో చదివింపుల విందు వేడుకను గడిచిన వందేళ్లుగా నిర్వహిస్తున్నట్లు చెబుతారు. ఈ విందును ఎవరికి వారు తమ స్థోమతకు తగ్గట్లే ఏరపాటు చేస్తారు.

విందుకు వచ్చిన వారు నగదును చదివింపులుగా చెల్లిస్తారు. ఒకసారి చదివింపుల విందు ఏర్పాటు చేస్తే.. మళ్లీ ఐదేళ్ల వరకు నిర్వహించకూడదన్న ప్రాథమిక సూత్రంతో దీన్ని నిర్వహిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే పాతకాలం కిట్టీ పార్టీ లాంటిదిగా చెప్పొచ్చు. సాయం కోసం ఎవరి దగ్గర చేయి చాచకుండా కష్టంలో ఉండే బంధువులకు చేయూతను ఇచ్చేందుకు వీలుగా ఈ ఆచారాన్నిషురూ చేశారు.

పేరావూరిణి నియోజకవర్గ ఎమ్మెల్యే డీఎంకే నేత అశోక్ కుమార్ తన మనమడి చెవులు కుట్టే వేడుకతోపాటు చదివింపుల విందును ఒకేసారి నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా వెజ్.. నాన్ వెజ్ కోసం వేర్వేరుగా విందునుఏర్పాటు చేయటమే కాదు.. దీనికోసం వచ్చే వారుచెల్లించే చదివింపుల కోసం ఏకంగా 40 కౌంటర్లు ఏర్పాటు చేశారు.

పిలిచింది ఎమ్మెల్యే కావటం.. అది కూడా అధికార పార్టీ కావటంతో చదివింపులు భారీగా వచ్చాయి. మొత్తం చదివింపులు రూ.10కోట్లు రావటం అందరిని ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. జయమ్మ పంచాయితీ విషయానికి వస్తే.. సుమ నటించిన జయమ్మ పాత్ర కూడా ఇదే రీతిలో విందు నిర్వహిస్తే.. బంధువులు.. ఊళ్లో వాళ్లు చదివింపులు చదివించకపోవటం.. వాటి వసూలు కోసం ఆమె చేసే పంచాయితీగా ఈ మూవీని నిర్మించారు. రీల్ తరహాలో రియల్ గా నిర్వహించిన ఈ వేడుక వార్తాంశంగా మారింది.