Begin typing your search above and press return to search.

జ‌య‌ప్ర‌ద‌కు కేబినెట్ పోస్టు

By:  Tupaki Desk   |   27 Aug 2016 4:00 PM GMT
జ‌య‌ప్ర‌ద‌కు కేబినెట్ పోస్టు
X
సీనియ‌ర్ సినీ నటి - మాజీ ఎంపీ జయప్రదకు ల‌క్ చిక్కింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఖాళీగా ఉన్న ఆమెకు కేబినెట్ ర్యాంకు ప‌ద‌వి ద‌క్కింది. గ‌తంలో యూపీలోని రాంపూర్ నుంచి రెండు ప‌ర్యాయాలు స‌మాజ్‌ వాదీ పార్టీ త‌ర‌పున ఆమె లోక్‌ స‌భ‌కు ఎన్నిక‌య్యారు. అయితే ఆమెకు స‌న్నిహితుడైన స‌మాజ్‌ వాదీ పార్టీ సీనియ‌ర్ నేత అమ‌ర్‌ సింగ్ కొద్ది రోజులుగా అస‌మ్మ‌తి గ‌ళం వినిపిస్తున్నారు.

పార్టీలో త‌న‌తో పాటు త‌న స‌న్నిహితురాలైన జ‌య‌ప్ర‌ద‌కు అవ‌మానం జ‌రుగుతోంద‌ని... త‌మ‌కు స‌రైన గౌర‌వం లేక‌పోతే తాము పార్టీ నుంచి వైదొల‌గుతామ‌ని ఆయ‌న హెచ్చ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే జ‌య‌ప్ర‌ద‌ను యూపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కౌన్సిల్ డిప్యూటీ చైర్‌ ప‌ర్స‌న్‌ గా నియ‌మిస్తూ యూపీ సీఎం అఖిలేష్ యాద‌వ్ ఈ రోజు ఉత్త‌ర్వులు జారీ చేశారు.

అమ‌ర్‌ సింగ్ వ‌రుస హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలోనే అఖిలేష్ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని కూడా యూపీలో హాట్ డిస్క‌ర్ష‌న్ జ‌రుగుతోంది. ఇక యూపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కౌన్సిల్ చైర్మన్ గా కవి గోపాల్ దాస్ నీరజ్ ఉన్నారు. ఆయ‌న త‌ర్వాత డిప్యూటీ చైర్ ప‌ర్స‌న్‌ గా జ‌య‌ప్ర‌ద కొన‌సాగుతారు. 2010లో ఆమె అమ‌ర్‌ సింగ్‌ తో పాటు ఎస్పీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గుర‌య్యారు.

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఆమె ఏపీ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాల‌ని ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేశారు. ఒకానొక‌ద‌శ‌లో వైకాపా నుంచి రాజ‌మండ్రి ఎంపీగా ఆమె పేరు కూడా విన‌ప‌డింది. అయితే ఆమె ఆ త‌ర్వాత తిరిగి త‌న రాజ‌కీయ గురువు అమ‌ర్‌సింగ్‌తో పాటే సొంత గూటికి చేరుకున్నారు. ఇప్పుడు అసంతృప్తుల నేప‌థ్యంలో అఖిలేష్ ఆమెకు కేబినెట్ ర్యాంకుతో కూడిన ప‌ద‌వి ఇచ్చారు.