Begin typing your search above and press return to search.

టీడీపీ టైం పాస్ చేస్తూ గ‌డిపేస్తోంద‌ట‌

By:  Tupaki Desk   |   9 Oct 2016 4:50 PM GMT
టీడీపీ టైం పాస్ చేస్తూ గ‌డిపేస్తోంద‌ట‌
X
సుదీర్ఘ కాలం త‌ర్వాత తెర‌మీద‌కు వ‌చ్చిన‌ లోక్‌ సత్తాపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయ‌ణ ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. రాష్ట్రంలో అనేక సమస్యలతో సతమతమవుతున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ కాలక్షేప కార్యక్రమాలతోనే కాలం గడుపుతోందని మండిప‌డ్డారు. సీఎం దగ్గర నుంచి కిందిస్థాయి ప్రజాప్రతినిధి - అధికారుల వరకూ సామాన్యుల గోడు పట్టించుకోని వైనం గర్హనీయమని పేర్కొన్నారు. విజ‌య‌వాడ‌లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ ప్రకటన అనంతరం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ స‌ర్కారు తీరును త‌ప్పుప‌ట్టారు.

అపరిష్కృతంగా ఉన్న పోలవరంతోపాటు అనేక ప్రాజెక్టుల పై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని జేపీ విమర్శించారు. పోలవరం పూర్తి చేసే బాధ్య‌త‌ కేంద్రానిదే అయినప్పటికీ కనీసం ఆ విషయంలోనైనా రాష్ట్రం తగు చొరవ చూపని వైనం శోచనీయమన్నారు. రాబోయే మరికొద్ది రోజుల్లో లోక్‌సత్తాపార్టీ తరుఫున రాష్ట్ర నేతలతోపాటు తాను పోలవరం ప్రాజెక్టును సందర్శించి పరిశీలన చేస్తామన్నారు. అలాగే కృష్ణాపుష్కరాలను ఘనంగా నిర్వహించామని గొప్పలు చెప్పుకొంటున్న పాలకులు వాటి వల్ల జరిగిన దుబారాపై కూడా మాట్లాడాలన్నారు. పుష్కర ఖర్చులపై ఇప్పటికీ శ్వేతపత్రం విడుదల చేయని ప్రభుత్వ తీరుకు నిదర్శనమన్నారు. అమలుకాని వాగ్దానాలతో ప్రభుత్వం సామాన్యులను మోసం చేస్తూ కాలాన్ని నెట్టుకొచ్చిందే కానీ ఇప్పటివరకూ వాళ్లు సాధించిన ఘనత ఏమీ లేదని జేపీ ఎద్దేవా చేశారు.

ప్రత్యేక హోదా సాధనలో ఘోరంగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని గట్టిగా అడగలేకపోవడానికి గల కారణం సీఎం చంద్ర‌బాబు వైఫల్యమేనని జేపీ మండిప‌డ్డారు. రాజధాని నిర్మాణానికి ఖర్చు చేసిన మొత్తంపై కేంద్రానికి ఇప్పటివరకూ సరైన లెక్కలు చూపించని వైనంతోనే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మలేకపోతోందన్నారు. అలాగే రాష్ట్ర మున్సిపల్ మంత్రి నారాయణ ప్ర‌క‌ట‌న‌ల‌కే త‌ప్ప‌ రాష్ట్ర ప్రజలకు చేసిందేమిలేదన్నారు. మరోపక్క ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్ర ఖజానాపై చేస్తున్న ప్రకటనలు రాష్ట్ర ప్రభుత్వ నడవడికకు నిదర్శనమన్నారు. సీఎం చంద్ర‌బాబు చేస్తున్న దుబరా ఖర్చులకు కళ్లెం వేయలేని ఆయన ఆదాయం మెరుగుకు ప్రజలపై పన్నుభారాలు మోపేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/