Begin typing your search above and press return to search.

రాజధాని అంశంపై లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌ నారాయణ సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   17 Oct 2022 6:11 AM GMT
రాజధాని అంశంపై లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌ నారాయణ సంచలన వ్యాఖ్యలు!
X
అమరావతి నుంచి రాజధానిని మార్చడం జగన్‌ ప్రభుత్వానికి సాధ్యం కాదని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, లోక్‌çసత్తా వ్యవస్థాపకుడు డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ తేల్చిచెప్పారు. రాజధాని అంశంపై ఏపీ హైకోర్టు స్పష్టమైన తీర్పును ఇచ్చిందని గుర్తు చేశారు. మూడు రాజధానుల పేరుతో ప్రజలతో ఆడుకోవడం మానుకోవాలని జేపీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. గత ప్రభుత్వం రైతుల నుంచి రాతపూర్వక ఒప్పందాలతో భూములు తీసుకుందని ఆయన గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలో అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గత టీడీపీ ప్రభుత్వం ఈ మేరకు రైతుల భూముల్లో రాజధానిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిందని అన్నారు. ఇప్పుడు ఈ లిఖితపూర్వక హామీపై వెనక్కి వెళ్లడం జగన్‌ ప్రభుత్వానికి సాధ్యం కాదని స్పష్టం చేశారు. కోర్టు కూడా అదే చెప్పిందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని జయప్రకాష్‌ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిని వదిలిపెట్టి.. సంక్షేమమే ధ్యేయంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను బాగున్నా.. రాష్ట్రానికి ఆదాయం వచ్చేలా అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలని జగన్‌ ప్రభుత్వానికి సూచనలు చేశారు.

రాష్ట్రానికి ఆస్తుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించాలని.. లేకుంటే రాష్ట్రం శ్రీలంక దారిలో వెళ్తుందని జేపీ హెచ్చరించారు. సంక్షేమ కార్యక్రమాల పేరుతో రాష్ట్ర వనరులను వృథా చేయొద్దని జగన్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీర్ఘకాలికంగా రాబడి వచ్చేలా రాష్ట్రాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల తీరును ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధనను స్వాగతించారు, అయితే అట్టడుగు తరగతులకు మాతృభాషలో బోధించాలన్నారు. తొలిదశలో ముందుగా మాతృభాషలో బోధిస్తేనే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు.

కాగా లోక్‌సత్తా పార్టీని ఏర్పాటు చేసిన జయప్రకాష్‌ నారాయణ 2009లో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో మల్కాజ్‌గిరి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ప్రస్తుతం రాజకీయాల్లో ఆయన అంతగా క్రియాశీలకంగా లేరు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.