Begin typing your search above and press return to search.

సేవ విషయంలోనూ సందేహాలేంటి జయసుధ

By:  Tupaki Desk   |   17 Jan 2016 4:10 AM GMT
సేవ విషయంలోనూ సందేహాలేంటి జయసుధ
X
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ ఎస్ దెబ్బకు మిగిలిన రాజకీయ పార్టీలు బెదిరిపోతున్నాయని.. ఆ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ధాటికి విలవిలలాడిపోతున్నాయన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. సహజనటిగా పేరొందిన జయసుథ తెలుగుదేశం పార్టీలో చేరి పలువురిని ఆశ్చర్యపరిచారు. ఇంతకాలం కాంగ్రెస్ లో ఉన్న ఆమె శనివారం చంద్రబాబు చేతుల మీదుగా పార్టీలో చేరిపోయారు.

రాజకీయ నాయకులు అన్న తర్వాత ఎప్పుడూ ఒకే పార్టీని అంటి పెట్టుకొని ఉంటారనుకోవటం అవివేకమే. అవకాశం.. అవసరానికి అనుగుణంగా పార్టీలు మారటం వారికి బాగానే తెలుసు. తాజాగా జయసుధ వ్యవహారమే తీసుకుంటే వైఎస్ ఆశీస్సులతో కాంగ్రెస్ లోకి చేరిన ఆమె.. తాజాగా తెలుగుదేశంలో చేరుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు ఎమ్మెల్యే అయిన ఆమె.. తాజాగా ఏ రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తారన్న విషయం మీద స్పష్టత ఇవ్వకపోవటం కాసింత ఆసక్తికరంగా మారింది.

మీరు తెలంగాణ టీడీపీలో చేరారా? ఏపీ టీడీపీలో చేరారా? అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వని ఆమె.. తాను ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేనన్న విషయాన్ని గుర్తు చేశారు. తాను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమన్న ఆమె.. ఇకపై క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా ఉంటానని వెల్లడించారు. జయసుధ వ్యవహారం చూస్తుంటే.. ఏపీలో ఏదో ఒక నామినేటెడ్ పదవికి ఆమెను ఎంపిక చేస్తారా? అన్న అనుమానం రాక మానదు. దీనికి జయసుధ చెప్పిన మాటలే కారణం. ఒక ప్రశ్నకు సమాధానంగా.. బంధుత్వం పరంగా చూస్తే తెలంగాణతో పోలిస్తే.. ఆంధ్రప్రదేశ్ తోనే తన అనుబంధం ఎక్కువని వ్యాఖ్యానించటమే దీనికి నిదర్శనం. తాను ఏ ప్రాంత ప్రజలకు సేవ చేస్తానన్న అంశంపై స్పష్టత ఇవ్వని జయసుధ.. సైకిల్ సవారీతో తనకేం ప్రయోజనమన్న విషయంలో స్పష్టత ఉన్నట్లే కనిపిస్తోంది. చేసే పని ముందే చెప్పేస్తే రాజకీయం ఎందుకవుతుంది.