Begin typing your search above and press return to search.

టీడీపీకి గుడ్‌ బై..రాజ‌కీయాల్లోకి జ‌య‌సుధ రీఎంట్రీ?

By:  Tupaki Desk   |   27 Nov 2018 4:52 PM GMT
టీడీపీకి గుడ్‌ బై..రాజ‌కీయాల్లోకి జ‌య‌సుధ రీఎంట్రీ?
X
సహజనటి జయసుధ మళ్లీ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారా ? త‌న భ‌ర్త అకాల‌మ‌ర‌ణం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆమె మ‌ళ్లీ త‌న వృత్తి సంబంధ‌మైన కార్య‌క‌లాపాల్లో బిజీ అవుతూ ప్ర‌వృత్తి అయిన రాజ‌కీయాల్లో కూడా బిజీ కానున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. 2009లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన జయసుధ పోటీ చేసి తొలిసారే గెలుపొందారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఓటమి చవి చూశారు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌ పై విజయం సాధించిన జయసుధ - తర్వాత నగర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడింది మొదలు.. ఆమె కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా ఉంటున్నారు. చివరికి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలోనూ ఆమె పాల్గొన‌లేదు. అనంత‌రం ఆమె టీడీపీలో చేరారు. కానీ కొన్ని పరిణామాల నేపథ్యంలో జయసుధ రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

అయితే, టీడీపీలో చేరిన త‌ర్వాత వివిధ కార‌ణాల వ‌ల్ల ఆమె క్రియాశీల రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. నగరంలో ఓ ఎగ్జిబిషన్‌ కు హాజ‌రైన జ‌య‌సుధ ఈ సంద‌ర్భంగా ఓ మీడియా సంస్థ‌ తో ముచ్చటించారు. భారతీయ సంస్కృతిలో భాగమైన చీరలంటే తనకెంతో ఇష్టమని..ఈ తరం నటీనటుల్లో అందరూ ఇష్టమేనన్నారు. ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని జయసుధ ప్రజలకు సూచించారు. రాజ‌కీయాల్లో క్రియాశీలంగా ఉండ‌టంపై ఆలోచించి నిర్ణ‌యం తీసుకుంటాన‌న్నారు. త‌ద్వారా భవిష్యత్‌ లో మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేకపోలేదని జయసుధ సంకేతాలు ఇచ్చారు. అయితే, ఆమె టీడీపీకి గుడ్‌ బై చెప్తారా? లేదా ఆ పార్టీలోనే కొన‌సాగుతారా అనే సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇదిలాఉండ‌గా, గ‌త ఏడాది మార్చిలో జయసుధ భర్త నితిన్ కపూర్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం సంచలనం సృష్టించింది. ముంబైలో ఈ ఘటన చోటు చేసుకుంది. 1985లో జయసుధను వివాహం చేసుకున్నారు. బాలీవుడ్ నటుడు జితేంద్ర సోదరుడైన నితిన్ కపూర్ పలు సినిమాలకు..భోజ్ పురి - హిందీ భాషల్లో కొన్ని సీరియల్స్ ను నిర్మించారు. నితిన్ కపూర్..జయసుధ తనయుడు హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. మృతికి గల కారణాలు తెలియరావడం లేదు. ఆర్థిక ఇబ్బందులే కారణమని వార్త‌లు వ‌చ్చాయి.