Begin typing your search above and press return to search.

ఐపీఎల్ లో రూ.కోట్లు.. లక్ అంటే ఉనద్కత్ దే.. 12 ఏళ్లకు టీమిండియా పిలుపు

By:  Tupaki Desk   |   10 Dec 2022 12:30 PM GMT
ఐపీఎల్ లో రూ.కోట్లు.. లక్ అంటే ఉనద్కత్ దే.. 12 ఏళ్లకు టీమిండియా పిలుపు
X
అండర్ 19 స్థాయిలోనే ఆకట్టుకుని.. ఆ వెంటనే సీనియర్ జట్టు తలుపు కూడా తొక్కిన కుర్రాడు.. మంచి పేస్ అందులోనూ ఎడమచేతి వాటం ఉన్న వాడు ఎంతో గొప్ప ఆటగాడిగా ఎదుగుతాడని భావించారు. కానీ, మనం అనుకున్నట్లు ఏమీ జరగదు. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది. గుజరాత్ లో పుట్టి రంజీల్లో సౌరాష్ట్రకు ఆడే జైదేవ్ ఉనద్కత్ గురించి ఇదంతా.

చాన్నాళ్ల తర్వాత సీనియర్ బౌలర్‌ జయ్‌దేవ్ ఉనద్కత్‌కు భారత జట్టులోకి పిలుపు వచ్చింది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ కోసం పేసర్ మహమ్మద్ షమీ స్థానంలో అతడిని తీసుకొన్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అయితే బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. చేతికి గాయం కారణంగా షమీ సిరీస్‌ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.

2010 తర్వాత మళ్లీ ఇప్పుడు..

31 ఏళ్ల ఉనద్కత్.. 2010 అండర్ 19 ప్రపంచ కప్ జట్టు సభ్యుడు. ఆ టోర్నీలో ప్రధాన బౌలర్ కూడా. ఆ వెంటనే 2010లో జాతీయ జట్టులోకి అరంగేట్రం చేశాడు. అయితే, కేవలం ఒక టెస్టు మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్కటీ ఆడలేదు. ఏడు వన్డేలు, 10 టీ20ల్లో మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు.

తాజాగా విజయ్‌ హజారే ట్రోఫీలో అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శనతో ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌ జట్టులోకి వచ్చాడు. 10 మ్యాచుల్లో 19 వికెట్లు తీశాడు. అయితే వీసా ప్రక్రియ ముగియగానే చిట్టగాంగ్‌లో టీమ్‌తో కలుస్తాడు.

కాలం కలసిరాక.. ఫామ్ లేక

మంచి బౌలింగ్ యాక్షన్ తో ఉనద్కత్ న్యూజిలాండ్ లో జరిగిన 2010 అండర్ 19 టోర్నీలో రాణించడంతో టీమిడియా, ఐపీఎల్ లో అవకావఆలు దక్కాయి. 2010లో ఐపీఎల్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ అతడిని తీసుకుంది. ఉనద్కత్ ప్రతిభను గుర్తించింది దిగ్గజ పేస్ బౌలర్ వసీం అక్రమ్ కావడం విశేషం. అదే ఏడాది ఇండియా ఎ జట్టుకూ ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. వెస్టిండీస్ ఎ పై 103 పరుగులకు 13 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. దక్షిణాఫ్రికాపై 2010 చివర్లో జరిగిన టెస్టు సిరీస్ లో జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే, 26 ఓవర్లలో వికెట్లమీ తీయకుండా 101 పరుగులివ్వడంతో ఉనద్కత్ ఆపై అవకాశాలు రాలేదు. 2013 లో వన్డే జట్టుకు ఎంపికైనా మళ్లీ అదే తీరు. విఫలం కావడంతో అంతర్జాతీయ కెరీర్ ముందుకు సాగలేదు.

ఐపీఎల్ లో రూ.కోట్లాభిషేకం..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ రూపంలో ఉనద్కత్ లక్ మరోసారి పనిచేసింది. రాజస్థాన్ అతడిని 2018లో రూ.13 కోట్లకు పాడుకుంది. ఆ ఏడాది అతడే టాప్ పెయిడ్. ఆ తర్వాతి ఏడాది కూడా ఉనద్కత్ కు రూ.10 కోట్లకు పైనే ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీ ప్రదర్శనతో టీమిండియా గడప తొక్కబోతున్నాడు. విజయ్ హజారే టోర్నీలో సౌరాష్ట్ర జట్టుకు ఉనద్కతే సారథి. ఆ టోర్నీలో విజేత కూడా సౌరాష్ట్రనే కావడం విశేషం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.