Begin typing your search above and press return to search.

ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్ దోస్త్

By:  Tupaki Desk   |   10 Feb 2020 10:00 AM GMT
ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్ దోస్త్
X
తెలంగాణ ఐటీ శాఖ అంటే మంత్రి కేటీఆర్ తో పాటు ఆయన పక్కనే చిరునవ్వులు చిందిస్తూ ఓ వ్యక్తి కనిపిస్తాడు. ఆయనే జయేశ్ రంజన్. 1992 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ తెలంగాణ ఐటీ శాఖలో కీలక భూమిక పోషిస్తున్నారు. కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా విజయం సాధించడంలో జయేశ్ రంజన్ పాత్ర ఎంతో ఉంది. దీంతో కేటీఆర్ జయేశ్ రంజన్ జోడీ కలిసొచ్చిందని అందరూ పేర్కొంటారు. వీరిద్దరూ దోస్తులుగా ఉంటారు. ఇప్పుడు జయేశ్ రంజన్ తెలంగాణ ఒలింపిక్‌ సంఘం (టీఓఏ) అధ్యక్షుడిగా ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి కె.రంగారావుపై 13 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం ఒలింపిక్స్‌ భవన్‌ లో ఆదివారం తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన టీఓఏ ఎన్నికలు జరిగాయి. మొత్తం 84 ఓట్లలో 81 ఓట్లు పోలయ్యాయి. జయేశ్‌ రంజన్‌ కు 46 ఓట్లు రాగా - రంగారావుకు 33 మాత్రమే వచ్చాయి. అయితే క్రాస్‌ ఓటింగ్‌ జరగడంతో మిగిలిన పదవులకు అంచనాలకు విరుద్ధంగా ఫలితాలు వచ్చాయి. మొత్తం 26 పోస్టుల్లో అధ్యక్ష పదవి సహా మరో నాలుగు స్థానాల్లో జయేశ్‌ రంజన్‌ ప్యానెల్‌ విజయం సాధించింది. టీఓఏ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీలో నిలిచిన జయేశ్‌ ప్యానెల్‌ అభ్యర్థి - రాష్ట్ర హ్యాండ్‌ బాల్‌ సంఘం అధ్యక్షుడు ఏ.జగన్‌ మోహన్‌ రావు విజయం పక్కా అని భావించగా ఆయన రెండు ఓట్ల తేడాతో జగదీశ్వర్‌ యాదవ్‌ చేతిలో ఓటమి చెందారు.

రంగారావు ప్యానెల్‌ అభ్యర్థి జగదీశ్వర్‌కు 41 ఓట్లు పోలవగా జగన్‌ మోహన్‌ కు 39 ఓట్లు వచ్చాయి. మరో ఓటు చెల్లుబాటు కాలేదు. కోశాధికారి పదవికి రంగారావు ప్యానెల్‌ తరఫున పోటీలో చేసిన కె.మహేశ్వర్‌ (46 ఓట్లు) - ఫణిరావు (31)పై గెలిచారు. నాలుగు ఓట్లు చెల్లలేదు. ఉపాధ్యక్షులుగా ఎస్‌.వేణుగోపాలాచారి (67 ఓట్లు) - రఫత్‌ అలీ (60) - ప్రేమ్‌ రాజ్‌ (57) - సరల్‌ తల్వార్‌ (53) ఎన్నికయ్యారు.

సంయుక్త కార్యదర్శుగా జయేశ్‌ ప్యానెల్‌ కు చెందిన ఏ.సోమేశ్వర్‌ (40 ఓట్లు) - రంగారావు వర్గానికి చెందిన మల్లారెడ్డి (49) - రామకృష్ణ (45) - నార్మన్‌ ఇసాక్‌ (63) గెలుపొందారు. రాష్ట్ర క్రీడా సంఘాల ఈసీ సభ్యులుగా అబ్బాస్‌ కిర్మాణి - దత్తాత్రేయ - మహేందర్‌ రెడ్డి - పురుషోత్తం - రామకోటేశ్వరరావు - కె.రామకృష్ణ - ఇస్మాయిల్‌ బేగ్‌ - హంజా బిన్‌ ఒమర్‌ - టి.స్వామి - మహమ్మద్‌ ఖాజా ఖాన్‌ ఎంపికవగా - రాజేంద్ర ప్రసాద్‌ - అజీజ్‌ ఖాన్‌ - జనార్దన్‌ రెడ్డి - లింగయ్య - మనోహర్‌ జిల్లా ఒలింపిక్‌ సంఘాలకు ఈసీ సభ్యులుగా గెలిచారు.

అయితే జయేశ్ రంజన్ పోటీపై తొలుత ప్రతిష్టంభన ఏర్పడింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో అతడి పోటీకి అనుమతి లభించడంతో జయేశ్ రంజన్ పోటీ చేసి గెలుపొందారు.