Begin typing your search above and press return to search.

ఈడీ ఉచ్చులో జేసీ బ్ర‌ద‌ర్స్.. వ‌రుస‌గా రెండో రోజు విచార‌ణ‌!

By:  Tupaki Desk   |   8 Oct 2022 9:48 AM GMT
ఈడీ ఉచ్చులో జేసీ బ్ర‌ద‌ర్స్.. వ‌రుస‌గా రెండో రోజు విచార‌ణ‌!
X
సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్ -3 వాహ‌నాల‌ను కొనుగోలు చేయ‌డం, వాటిని నకిలీ పత్రాలతో బీఎస్‌-4 వాహ‌నాలుగా మార్చ‌డం, వాహనాల రిజిస్ట్రేషన్లు, ఫోర్జరీ చేసిన‌ ఎన్‌ఓసీలతో వాహనాల కొనుగోలు, అమ్మకాల వెనుక భారీగా నల్లధనం చేతులు మారిన బాగోతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) టీడీపీ నేత‌, అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి కుటుంబ సభ్యులపై ఉచ్చుబిగుస్తోంది. దీనికి సంబంధించి మనీ లాండరింగ్‌ చట్టాలను ఉల్లంఘించిన వ్యవహారంలో విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు జేసీ ప్రభాకర్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో అక్టోబ‌ర్ 7 విచారణకు హాజరయ్యారు.

ఈడీ విచార‌ణ‌కు వ‌చ్చిన‌వారిలో ఆయ‌న‌తోపాటు ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డి కూడా ఉన్నారు. దాదాపు 5 గంటలపాటు అధికారులు వీరిద్ద‌రిని వివిధ అంశాల‌పై ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం. విచారణానంతరం జేసీ ప్రభాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులు విచారణకు రమ్మని నోటీసులివ్వడంతో వచ్చానని తెలిపారు. లారీల కొనుగోలుపై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. విచారణకు సహకరిస్తానని, ఎప్పుడు పిలిచినా తాను విచారణకు హాజరవుతానన్నారు.

వివిధ అంశాల‌పై జేసీ ప్ర‌భాక‌ర్‌ను, ఆయ‌న కుమారుడు అస్మిత్ రెడ్డిని విచారించిన ఈడీ రెండో రోజు అక్టోబ‌ర్ 8న కూడా జేసీ ప్ర‌భాక‌ర్‌ను విచారించింది. అక్టోబ‌ర్ ఉద‌యం 10.15 గంట‌ల‌కు హైద‌రాబాద్‌లోని ఈడీ కార్యాల‌యానికి విచార‌ణ నిమిత్తం జేసీ ప్ర‌భాక‌ర‌రెడ్డి హాజ‌ర‌య్యారు.

ఈడీ చెబుతున్న‌దాని ప్ర‌కారం.. టీడీపీ సీనియర్‌ నేతలు జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి బ్రదర్స్‌ సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్‌–3 కేటగిరీకి చెందిన 154 లారీలు, బస్సులను తుక్కు కింద జటాధర ఇండస్ట్రీస్‌ పేరున 50, సి. గోపాల్‌రెడ్డి అండ్‌ కో పేరున 104 వాహనాలను కొనుగోలు చేశారు. వాటిని నకిలీ పత్రాలతో వాటిని బీఎస్‌–4 వాహనాలుగా చలామణిలోకి తెచ్చారు. అనంతరం వాటిని నాగాలాండ్‌ రాజధాని కోహిమాలో రిజిస్ట్రేషన్‌ చేయించి నిర‌భ్యంత‌ర ప‌త్రం (ఎన్‌ఓసీ) పొందారు. ఆ తర్వాత 15 రోజుల్లోనే వాటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లలో మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేయించారని వారిపై అభియోగాలు ఉన్నాయి.

ఇలా ఆంధ్రప్రదేశ్‌లో 101 వాహనాలు, తెలంగాణలో 33 వాహనాలు, కర్ణాటకలో 15 వాహనాలు, తమిళనాడులో ఒకటి, ఛత్తీస్‌గఢ్‌లో ఒక బస్సు జేసీ బ్ర‌ద‌ర్స్ తిప్పుతున్నారు. ఆ వాహనాలకు లైసెన్సులు తీసుకోవ‌డానికి కూడా ఫోర్జరీ పత్రాలు సమర్పించారు. అంతేకాక.. వాహనాల బీమాలోనూ వీరు ఫోర్జరీకి పాల్పడ్డార‌ని ఆరోప‌ణ‌లున్నాయి. ఈ వాహ‌నాల‌ను ఆయా రాష్ట్రాల్లో కొద్దిరోజుల పాటు తిప్పి ఆ తర్వాత పోలీసుల నుంచి ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్లు పొందార‌ని.. వాటిని ఇతర రాష్ట్రాల వారికి విక్రయించేశార‌ని జేసీ బ్ర‌ద‌ర్స్‌పై అభియోగాలు ఉన్నాయి. అయితే వీటిని కొనుగోలు చేసినవారు తాము మోసపోయామని గుర్తించి ఫిర్యాదు చేశారు. దీంతో జేసీ బ్ర‌ద‌ర్స్ అక్ర‌మాలు బ‌య‌ట‌కొచ్చాయి.

సమగ్ర సమాచారం కోసం పోలీసులు ‘నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఐసీ)’ రికార్డులను పరిశీలించ‌గా జేసీ కుటుంబం సమర్పించిన బీమా పత్రాలు నకిలీవని వెల్ల‌డైంది. దీంతో అనంతపురం డిప్యూటీ రవాణా శాఖ కమిషనర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 2020 జూన్‌లో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయ‌న కుమారుడు అస్మిత్‌రెడ్డితోపాటు 23 మందిపై వివిధ సెక్షన్ల కింద 35 కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను అరెస్టుచేశారు. ప్ర‌స్తుతం వారిద్ద‌రూ బెయిల్‌పై ఉన్నారు.

ఆ తర్వాత జేసీ కుటుంబం అక్రమాలపై ప్రత్యేకంగా దర్యాప్తు జరపాలని రాష్ట్ర పోలీసులు కేంద్రానికి లేఖ రాశారు. దీంతో జేసీ కుటుంబం వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం ఈడీని రంగంలోకి దించింది. కొన్నినెలల క్రితం ఈడీ అధికారులు అనంతపురం రవాణా శాఖ అధికారుల నుంచి ప‌లు ఆధారాలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ప‌లుచోట్ల సోదాలు, త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా జేసీ ప్ర‌భాక‌ర్‌ను, ఆయ‌న కుమారుడు అస్మిత్ రెడ్డిని ఈడీ విచారించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.