Begin typing your search above and press return to search.

ప్ర‌మాదాలు కామన్ అంటున్న జేసీ బ్ర‌ద‌ర్స్‌

By:  Tupaki Desk   |   1 March 2017 5:14 AM GMT
ప్ర‌మాదాలు కామన్ అంటున్న జేసీ బ్ర‌ద‌ర్స్‌
X
రాజకీయాల్లో డైన‌మిస్ట్‌ నాయ‌కులుగా చెప్పుకునే అనంత‌పురం జిల్లాకు చెందిన అన్న‌ద‌మ్ములైన ప్ర‌జాప్ర‌తినిధులు జేసీ దివాక‌ర్ రెడ్డి - జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి తీరు చ‌ర్చనీయాంశంగా మారింది. కృష్ణా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై జేసీ బ్ర‌ద‌ర్స్ తేలిక‌గా స్పందించారు. ప్రభాకర్‌ రెడ్డి మేన‌ల్లుడికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టిక్కెట్టు తెలుగుదేశం పార్టీ తరుపున ఖరారైన నేపథ్యంలో నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో వారు పాల్గొనేందుకు అనంతపురం వచ్చారు. ఈసందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జిల్లాల్లో జరిగిన బస్సు ప్రమాదం ఘటన దురదృష్టకరమని అన్నారు. అయితే ప్రమాదాలు సహజమని, డ్రైవరు పొరబాటు వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నామని చెప్పారు. ఈ ప్రమాదంతో తన మేనల్లుడికి ఎమ్మెల్సీ సీటు వచ్చిన ఆనందం కూడా ఆవిరైపోయిందని జేసీ ప్రభాకర్‌ రెడ్డి అన్నారు.

కాగా, ప్రైవేటు ట్రావెల్స్‌ లో అతి పెద్ద వాటిల్లో ఒక్కటైన దివాకర్‌ ట్రావెల్స్ ఇటీవ‌లి కాలంలో మ‌ళ్లీ వివాదంలో ప‌డింది. తాజాగా జ‌రిగిన కృష్ణా జిల్లా ప్ర‌మాద ఘ‌ట స్థాయిలో గ‌తంలోనూ ఘోర ప్ర‌మాదానికి కార‌ణ‌మైంది. 2013 అక్టోబరు 30న మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని పాలెం వద్ద ఓల్వో బస్సుకు జరిగిన ప్రమాదంలో అగ్నికి ఆహుతై 45 మంది మృతిచెందారు. దివాకర్‌ ట్రావెల్స్‌ శాఖ జబ్బార్‌ ట్రావెల్స్ కు చెందిన బ‌స్సు ఇది. భద్రతకు యాజమాన్యం తీసుకుంటున్న చర్యలపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోనూ దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు సర్వీసులు ఎక్కువగా నడుస్తున్నాయి. ఒక్క తెలంగాణాలోనే 250 బస్సులు దివాకర్‌ ట్రావెల్స్‌కు సంబంధించి నడుస్తున్నాయని తెలంగాణ అసెంబ్లీలోనే టిఆర్‌ ఎస్‌ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్‌ వ్యాఖ్యనించడం గమనార్హం. కర్నాటక - కేరళ - ఒడిశా వంటి సుదూర ప్రాంతాలకు బస్సు సర్వీసులను దివాకర్‌ ట్రావెల్స్‌ నడుపుతోంది. వీటిల్లో నిబంధనలు ఏ మేరకు పాటిస్తున్నారన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇదే అంశాన్ని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్‌ ఇటీవల ఎత్తిచూపారు.

కాంట్రాక్టు క్యారేజీల పేరుతో పర్మిట్లు పొంది... స్టేజీ క్యారేజీలు నడుపుతున్నట్టు ఆరోపించారు. మంగళవారం కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలోనూ బస్సు కాంట్రాక్టు క్యారేజీ కింద హైదరాబాద్‌ నుంచి భువనేశ్వర్‌కు అనుమతులు పొందారు. కానీ మధ్యలో విజయవాడ ప్రాంతంలో పలుచోట్ల ప్రయాణికులను ఎక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇది నిబంధనలను అతిక్రమించడమేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇకపోతే ప్రజలను రవాణా చేసే ఈ బస్సుల్లో గూడ్స్‌ సరఫరా కూడా అధికంగా ఉంటోందన్న ఆరోపణలున్నాయి. 2013లో పాలెం వద్ద జరిగిన ఘటనలో ఈ లోపాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికీ ఇవన్నీ కొనసాగుతూనే ఉన్నాయన్న విమర్శలున్నాయి. అధికారపార్టీ అండదండలు ఉండటంతో పాటు రాజకీయ పలుకుబడి ఉండటంతో యథేచ్ఛగా నిబంధనలను ఆ యాజమాన్యం ఉల్లంఘించి బస్సులను నడుపుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. డ్రైవర్లకు ఓవర్‌ షిఫ్టులు, నైట్‌ డ్యూటీలు ఎక్కువగా వేయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/