Begin typing your search above and press return to search.

గత్యంతరం లేక టీడీపీలో ఉన్నా ..జేసీ దివాకర్ రెడ్డి!

By:  Tupaki Desk   |   17 March 2021 10:58 AM GMT
గత్యంతరం లేక టీడీపీలో ఉన్నా ..జేసీ దివాకర్ రెడ్డి!
X
పాత మిత్రులను కలుసుకునేందుకు తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో కాసేపు ముచ్చటించారు. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు రాజగోపాల్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో జేసీ సరదాగా మాట్లాడారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులతో మాట్లాడుతూ.. 'మిత్రులందరినీ ఓసారి కలుద్దామనే అసెంబ్లీకి వచ్చాను. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ అక్కడా ఇక్కడా లేకుండా పోయింది. తెలంగాణ ఇచ్చి సోనియా గాంధీ పెద్ద తప్పు చేసింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. వేరే దారి చూసుకోవాల్సిన అవసరం ఉంది.

నాగార్జున సాగర్‌లో జానారెడ్డి గెలువలేడు. ఆయన కొడుకు రఘు వస్తే జనం వీళ్ల వైపు చూసే అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి కాలం చెల్లింది. ఇంకో రెండేళ్ల తర్వాత భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి నాగలి పట్టి వ్యవసాయం చేసుకోవాల్సిందే. రాజగోపాల్ రెడ్డి ఇంకో రెండు కాంట్రాక్టులు తెచ్చుకొని వ్యాపారం చేసుకుంటాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయల తెలంగాణ కావాలని అప్పుడు నేను ఇక్కడి రెడ్డి నేతలకు చెప్పాను కానీ, ఎవరూ వినలేదు. చివరిదాకా జైపాల్ రెడ్డి కూడా రాయల తెలంగాణ అన్నారు. దీంతో అందరూ ఆయనను తెలంగాణ ద్రోహి అన్నారు. రాయల తెలంగాణ వచ్చి ఉంటే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదని అయన అన్నారు. కొందరు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ముఖ్యమంత్రి, మంత్రి పదవులు ఆశించి అధిష్ఠానం మీద ఒత్తిడి తెచ్చారని విమర్శించారు. రాష్ట్ర విభజనతో మమ్మల్ని మెడపట్టి గెంటేశారు. దానివల్ల రెండు ప్రాంతాల్లోనూ పార్టీ నష్టపోయింది. ఛాలెంజ్‌ చేసి చెప్తున్నా.. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాలేదు. ఆ పార్టీకి జీవకళ పోయింది. ఇప్పుడు తెలంగాణలో కంటే ఏపీలో దుర్మార్గపు పాలన సాగుతోంది. జాతీయ పార్టీలు మంచివి.. గత్యంతరం లేకనే ప్రాంతీయ పార్టీలో కొనసాగుతున్నాఅని జేసీ తెలిపారు.